ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి..


Ens Balu
3
Kakinada
2021-10-11 12:46:51

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్య‌క్ర‌మానికి  వచ్చిన అర్జీల‌ను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో జేసీ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ‌, జేసీ (హౌసింగ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్.వి.ఎస్ సుబ్బలక్ష్మి, ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీ సునీత‌ త‌దిత‌రులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్పంద‌న కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చిన అర్జీలు, రీఓపెన్ అర్జీల ప‌రిష్కారంలో పురోగ‌తిపై జేసీ లక్ష్మీశ  స‌మీక్షించారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ శాఖల ప‌రిధిలో ఉన్న కోర్టు కేసులపై  ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించే విధంగా చూడాల‌ని ఆదేశించారు. ఈ అంశంపై ప్రతి వారం సమీక్షలు నిర్వహించాల‌న్నారు. సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి  ప్రజలు పాల్గొని, ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉద్యోగ ఉపాధి కల్పన, పెన్ష‌న్లు, ఉపకార వేతనం, బియ్యం, ఆరోగ్య శ్రీ కార్డుల మంజూరు, బీమా, భూముల స‌ర్వే తదితరాలకు సంబంధించి సుమారు 425 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.