సూపర్ 60 బ్యాచ్ గిరిజన విద్యార్ధికి 346 ర్యాంకు..
Ens Balu
3
Seethampeta
2020-09-12 19:15:39
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ 60 బ్యాచ్ గిరిజన విద్యార్ధి అఖిల భారత స్ధాయిలో ఎస్.టి కేటగిరిలో 346 వ ర్యాంకు సాధిం చారని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం యూత్ ట్రైనింగ్ సెంటర్ (వై.టిసి)లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావే శంలో జెఇఇ మెయిన్స్ లో సూపర్ 60 బ్యాచ్ సాధించిన విజయాలను ప్రాజెక్టు అధికారి ప్రకటించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచనల మేరకు అప్పటి ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.యం సాయికాంత్ వర్మ గిరిజన విద్యార్ధులకు సూపర్ 60 బ్యాచ్ ప్రారంభించి జెఇఇ, ఐఐటి, నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ప్రారంభిం చారని చెప్పారు. జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారి కృషికి ఫలితాలు దక్కాయని ఆయన పేర్కొంటూ కలెక్టర్, పి.ఓలకు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ 60 బ్యాచ్ లో 55 మంది విద్యార్ధులను ఎంపిక చేసి తీసుకోవడం జరిగిందని వారికి అత్యుత్తమ కోచింగు ఏర్పాటు చేసామన్నారు. కోవిడ్ 19 కారణంగా తరగతి గదిలో కోచింగును నిలిపివేయడం జరిగిందని, ఆన్ లైన్ ద్వారా బోధించామని పేర్కొన్నారు. విద్యార్ధులకు లాప్ టాప్ లు, రౌటర్ లు పంపిణీ చేసామని శ్రీధర్ చెప్పారు. 55 మందిలో 33 మంది జెఇఇలో అర్హత సాధించారని, అందులో 21 మంది విద్యార్ధులకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి)లలో సీట్లు లభిస్తాయని చెప్పారు. 33 మందిలో 26 మంది ఆదివాసీ తెగ (ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్)కు చెందిన సవర తెగకు చెందిన వారని వివరించారు. అఖిల భారత స్ధాయిలో 95.77 పెర్సంటైల్ సాధించి ఎస్.టి కేటగిరిలో 346 ర్యాంకును ఎం.ఎర్తా సింగ్ సాధించారని చెప్పారు. సూపర్ 60 బ్యాచ్ కు చెందిన ఎన్.సునిల్ 88.74 పెర్సంటైల్ సాధించి అఖిల భారత స్ధాయి ఎస్.టి కేటగిరిలో 1368 ర్యాంకు సాధించారని చెప్పారు. ఈ నెల 27వ తేదీన జెఇఇ అడ్వాన్సుడు పరీక్ష ఉందని, అందుకు విద్యార్ధులను సిద్ధం చేయడం జరుగుతోందని ప్రాజెక్టు అధికారి చెప్పారు. కనీసం 8మంది విద్యార్ధులకు ఐఐటిలలో సీట్లు లభిస్తాయని ఆశిస్తున్నట్లు శ్రీధర్ చెప్పారు. జెఇఇ మెయిన్స్ లో 90 పర్సంటైల్ దాటిన విద్యార్ధి ఒకరు కాగా, 80 పర్సంటైల్ దాటిన విద్యార్ధులు ముగ్గురు, 70 పర్సంటైల్ దాటిన విద్యార్ధులు 11 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ఐటిడిఏల పరిధిలో పరిశీలిస్తే సీతంపేట ఐటిడిఏ పరిధి విద్యార్ధులు మంచి ర్యాంకులు సాధించి విజయదుందుభి మోగించారని పి.ఓ అన్నారు.