బాలబాలికలు ఇద్దరూ సమానమేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.సి.చంద్రనాయక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కుటుంబంలో బాలురు బాలికలు ఇద్దరూ సమానమే తల్లిదండ్రులు తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. సామాజిక వివక్ష కారణంగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. భ్రూణ హత్యల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో పెద్ద ఎత్తున చైతన్యం అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాల బాలికల లో తండ్రి పాత్ర కీలకమని, గ్రామస్థాయిలో ముఖ్యంగా నిరక్షరాస్యులు అయినటువంటి తల్లిదండ్రులు, ప్రజల్లో తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. భ్రూణ హత్యలు సమాజంలో మాయని మచ్చగా మిగులుతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం బాగా ఉందని ఆయన చెప్పారు. జిల్లాలో వెయ్యి మంది బాలురకు 953 మంది బాలికలు ఉన్నారనీ ఇంతటి వ్యత్యాసం సరికాదని అసమతౌల్య స్థితికి దారితీస్తుందని అన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఒక మహిళను ఎక్కువ మంది పెళ్లి చేసుకునే సాంప్రదాయం కొనసాగుతుందని చెప్పారు. ఇటువంటి వ్యవస్థ ఆదర్శవంతమైన సమాజానికి మంచిది కాదని స్పష్టం చేశారు. మహిళల పురోగతి ఎక్కడ ఉంటుందో ఆ సమాజం అన్ని విధాల రాణిస్తుందని పేర్కొన్నారు. బ్రూణ హత్యలు నివారించి బాలికల నిష్పత్తి పెంచాలన్నారు. బ్రూణ హత్యలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఇంటింటికీ వెళ్ళినప్పుడు బ్రూణ హత్యలు పై గర్భిణీలు, తల్లులకు వివరించాలని సూచించారు.
అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాధరావు మాట్లాడుతూ బాలబాలికల మధ్య తీవ్రమైన వ్యత్యాసం వలన సామాజిక పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు. డి.ఎస్.పి ఎం.మహేంద్రనాథ్ మాట్లాడుతూ బాలికల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. హత్యల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలు నివారించాలని పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారికి, భ్రూణ హత్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు. బాలికలు, మహిళల పట్ల సమాజంలో వివిధ కోణాలలో దుష్కృత్యాలు జరుగుతున్నాయని అటువంటి సంస్కృతి నుండి బయట పడాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలను గూర్చి అవగాహన పొందాలని అవసరం అయినప్పుడు వాటిని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రసూతి విభాగం హెడ్ డాక్టర్ వాణి మాట్లాడుతూ బాలికల జనంలో పురుషుల పాత్ర ప్రధానమని, ఈ విషయాన్ని సమాజానికి అవగాహన చెందే వరకు తెలియజేయాల్సిన అవసరం ఉందనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ నాయుడు డి సి హెచ్ ఎస్ డాక్టర్ సూర్య రావు వైద్యులు వైద్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.