జల జీవన్ మిషన్ పనులు త్వరగా పూర్తిచేయాలి..
Ens Balu
10
Vizianagaram
2021-10-12 13:46:20
విజయనగరం జిల్లాలో జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులన్నీ పూర్తిచేసి సి.పి.డబ్ల్యు.పథకాల ద్వారా పూర్తి స్థాయిలో గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలని జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గ్రామీణ నీటిసరఫరా అధికారులను ఆదేశించారు. పనులు పూర్తిచేసి ఇంటింటికీ తాగునీటిని కొళాయిల ద్వారా అందించాలన్నారు. జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇంజనీర్లతో తాగునీటి సరఫరా, పథకాల నిర్వహణ తదితర అంశాలపై జెడ్పీ ఛైర్మన్ మంగళవారం సమీక్షించారు. రక్షిత తాగునీటి సౌకర్యంలేని బోర్లు లేని గ్రామాలు, మారుమూల గిరిజన గ్రామాలు, కొండశిఖర గ్రామాలకు సంబంధించి జెడ్పీ నిధులతో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. భోగాపురం మండలంలో తీరగ్రామాల్లో రక్షిత త్రాగునీటి సరఫరా అవసరమైన గ్రామాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలన్నారు. గులాబ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న రక్షిత నీటి పథకాలకు మరమ్మత్తులు పూర్తిచేసి విద్యుత్ శాఖ సహకారంతో ఆయా పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్దరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్.ఇ. శివానంద కుమార్, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఇ.ఇ., డి.ఇ., ఏ.ఇ.లు పాల్గొన్నారు.