అక్రమ మద్యం నిర్మూళన పటిష్టంగా జరగాలి..
Ens Balu
6
Kakinada
2021-10-12 13:55:25
తూర్పుగోదావరిజిల్లాలో అక్రమ మద్యం నిర్మూలనకు పోలీస్, అటవీ, ఎక్సైజ్, ఎస్ఈబీ శాఖల అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి జేసీ లక్ష్మీ శ.. పోలీస్, అటవీ, ఎక్సైజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి తదితర శాఖల అధికారులతో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలు తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ అక్రమ మద్యం, నాటు సారా తయారీ, అమ్మకాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ద్వారా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకు ఎక్సైజ్, అటవీ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ ఆదేశించారు. అక్రమ మద్యం, నాటు సారా తయారీ వంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదుచేయాలన్నారు. అటవీ, సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని జేసీ లక్ష్మీశ అధికారులకు సూచించారు. ఈ వీసీలో కాకినాడ అడిషనల్ ఎస్పీ కె.కుమార్, డీఫ్ వో ఐకెవి రాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్.లక్ష్మీకాంత్, డీఆర్డీఎ పీడీ కె.శ్రీరమణి సీపీవో పి.త్రినాథ్, ఇతర అధికారులు హాజరయ్యారు.