రేపు శ్రీకాకుళంలో సంపూర్ణ లాక్ డౌన్..జిల్లా కలెక్టర్


Ens Balu
3
Srikakulam
2020-09-12 19:21:38

శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కాయగూరల మార్కెట్లు, చికెన్, మటన్, చేపల మార్కెట్లు కూడా తెరవడం జరగదని ఆయన స్పష్టం చేసారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీకాకుళం పట్టణంలో కేసులు అధికంగా పెరుగు తున్న దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు. గత ఆది వారం లాక్ డౌన్ కు ప్రజలు మంచి సహకారం అందించారని చెప్పారు. మందుల దుకాణాలు లభ్యంగా ఉంటాయని, వాటితోపాటు వాటికి ఆనుకుని పాలు, బ్రెడ్ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని  ఆయన స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలను వినియోగించుకొనుటకు ఎటువంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేసారు. అంబులైన్సులు, వైద్య వాహనాలకు అనుమతి ఉందని పేర్కొంటూ అత్యవసర పరిస్థితుల్లో సొంత వాహనాల్లో వైద్యం నిమిత్తం వెళ్ళే వాహనాలకు కూడా ఆటంకం ఉండదని ఆయన తెలిపారు. అయితే అత్యవసరం కానప్పటికి వైద్య సేవలు పొందే నెపంతో బయట తిరిగే వాహనాలు, యజమానులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కుతోపాటు ఫేష్ షీల్డ్ ధరించాలని కోరారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన అన్నారు.
సిఫార్సు