ఈ క్రాప్, ఈకేవైసీ సత్వరమే పూర్తిచేయాలి..
Ens Balu
8
Kakinada
2021-10-12 14:00:14
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) ప్రధాన ధాన్యం సేకరణ కేంద్రాలుగా కూడా సేవలందించనున్ననేపథ్యంలో మొత్తం ప్రక్రియపై క్షేత్రస్థాయి అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జ.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టుహాల్ నుంచి జేసీ (ఆర్) జి.లక్ష్మీశ.. జేసీ (హెచ్) ఎ.భార్గవ్‌తేజతో కలిసి వర్చువల్ విధానంలో జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధతలో భాగంగా ఈ-క్రాప్ బుకింగ్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. కేవలం ధాన్యం కొనుగోలుకే కాకుండా వ్యవసాయరంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాలకు కూడా ఈ-క్రాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణకు సంబంధించి జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు నాణ్యతా తనిఖీలు చేయాలని ఆదేశించారు. డ్రోన్ సర్వేకు సన్నద్ధత కార్యకలాపాలను పూర్తిచేయాలన్నారు. దశల వారీగా జిల్లా మొత్తం సమగ్ర భూ సర్వే జరగనున్నందున అందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన ద్వారా అందుతున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జేసీ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఎ.భార్గవ్‌తేజ.. సీజనల్ వ్యాధుల నియంత్రణ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అమలవుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలుపై అధికారులకు పలు సూచనలు చేశారు. అదే విధంగా సచివాలయాల సిబ్బంది బయోమెట్రిక్ హాజరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరుగుతున్న ఆసరా కార్యక్రమాలు విజయవంతం చేయడంతోపాటు చేయూత, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు కార్యక్రమానికి సంబంధించి క్లస్టర్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని భార్గవ్‌తేజ ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ జీ.వీరేశ్వరప్రసాద్, ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి, డీఎస్వో పి. ప్రసాదరావు తదితరులు హాజరయ్యారు.