భారతీయ యోగ విద్యను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. మంగళవారం ఏయూ పాలక మండి సమావేశ మందిరంలో ఏయూతో అష్టాంగ న్యూరో థెరఫి, ఆయుర్వేద అండ్ యోగా(ఏఎన్‌ఏవై) సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఏఎన్‌ఏవై నిర్వాహకులు చలసాని జుగేష్ చంద్ర గురునాథ్‌లు సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ఏయూ సౌజన్యంతో ఏఎన్‌ఏవై సంస్థ ఆరు నెలల కాల వ్యవధితో డిప్లమో ఇన్ యోగా, యోగా సర్టిఫీకేట్ కోర్సులను నిర్వహించనున్నారు. ఒక్కో కోర్సులో 80 మందికి ప్రవేశం కల్పించనున్నారు. కోర్సుల నిర్వహణకు అవసరమైన సిలబస్, కోర్సు నిర్వహణను ఏయూ పర్యవేక్షిస్తుంది. యోగా విద్య, శిక్షణ, పరిశోధన రంగాలలో ఏయూతో ఏఎన్‌ఏవై సంస్థ పనిచేస్తుంది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించే దిశగా వర్సిటీ నిరంతరం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, యోగా కేంద్రం సంచాలకులు ఆచార్య ఓ.ఎస్.ఆర్‌యు భానుకుమార్, విభాగాధిపతి ఆచార్య కె.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.