సచివాలయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి...


Ens Balu
6
Visakhapatnam
2020-09-12 19:23:07

సచివాలయ పరీక్షలు జరిగే పరీక్షా కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శనివారం విఎంఆర్డిఎ చిల్డ్రన్స్ ఎరీనాలో గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల నోడల్ అధికార్లు, క్లస్టర్ ప్రత్యేక అధికార్లు, రూట్ ఆఫీసర్లు, సెంటర్ల ప్రత్యేక అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ ల శిక్షణా కార్యక్రమంలో (రెండవరోజు) ఆయన పాల్గొన్నారు. జివియంసి పరిధిలో నోడల్ అధికారిగా జివియంసి కమీషనర్ జి. సృజన, గ్రామీణ ప్రాంతాలకు నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్-1 వేణుగోపాల్ రెడ్డి ఉంటారని ఆయన వెల్లడించారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిస్తుందని, ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలను ముందుగానే సందర్శించి క్షణ్ణంగా పరిశీలించి కోవిడ్ కారణంగా గత కొన్ని నెలలుగా  విద్యా సంస్థలు  పనిచేయడం లేదని, అందువలన  పరీక్షా కేంద్రాలుగా  ఉపయోగించనున్న  ఆ సంస్థలలో  విద్యుత్, త్రాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, శానిటేషను  సదుపాయాలను  చూసుకోవాలని పేర్కొన్నారు.  అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం  పరీక్షలు నిర్వహించాలని, సిబ్బంది, అభ్యర్థులతో సహా ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు.  కోవిడ్ బాధితులకు  ప్రత్యేక ఐసొలేషను రూంలో పరీక్ష రాయించాలని తెలిపారు.  అవసరమైన  పి.పి.ఈ.కిట్లు, గ్లౌజులు, శానిటైజరు, ధర్మల్ స్కానర్స్, పల్స్ఆక్సీమీటరు లను సరఫరా చేస్తారని తెలిపారు.  పరీక్షా కేంద్రాలను  పరీక్షకు ముందు, తరువాత  తప్పని సరిగా శానిటైజ్ చేయాలని తెలిపారు.  15వ తేదీ సాయంత్రాని కల్లా  పరీక్షాకేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.  అభ్యర్థులకు సౌకర్యంగా ఉండేందుకు పరీక్షా కేంద్రాల మ్యాపులను బహిరంగంగా  ప్రదర్శించాలని తెలిపారు.  అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా  ప్రశాంతంగా పరీక్షకు సిద్దమై  సమయానికంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.    ఈ కార్యక్రమంలో  జిల్లా జాయింట్ కలెక్టర్-1 వేణుగోపాల్ రెడ్డి, జి.వి.యం.సి. కమీషనరు  జి. సృజన, జడ్ప్ సిఇఓ నాగార్జున సాగర్, డి.పి.ఒ. కృష్ణకుమారి, యితర జిల్లా అదికారులు పాల్గొన్నారు.