తిరుమలలో టిటిడి ఈవో విస్తృత తనిఖీలు..
Ens Balu
7
Tirumala
2021-10-13 06:39:14
టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి బుధవారం ఉదయం అధికారులతో కలిసి తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లేపాక్షి సర్కిల్ వద్ద గల ఫిల్టర్ హౌస్‌ను పరిశీలించారు. తిరుమలలోని వివిధ డ్యాంల నుండి వచ్చే నీటిని ఏవిధంగా శుద్ధి చేస్తున్నారు, పంపింగ్ సిస్టమ్ గురించి అధికారులు ఈవోకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గంటకోసారి శుద్ధి చేసిన నీటిని ప్రయోగశాలలో పరీక్షించి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిల్టర్ హౌస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నిరుపయోగంగా ఉన్న ఇంజినీరింగ్ పరికరాలను తొలగించి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. అనంతరం ఎఎన్‌సి, బాలాజి బస్టాండ్, ఎస్ఎమ్‌సి ప్రాంతాల్లోని రోడ్లు, కాటేజిల వద్ద పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్ఎమ్ సి, లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సబ్ వేలను, ముల్లగుంట, శంఖుమిట్ట విశ్రాంతి భవనము వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ముల్లగుంట కారు పార్కింగ్ ప్రాంతలో ఉన్న బ్యారికేడ్లు, కాంక్రీట్ వ్యర్థాలను తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శంఖుమిట్ట, శేషాద్రి నగర్, ఎఎమ్‌సి ప్రాంతాల్లో భక్తులు నడవడానికి వీలుగా కాళీగా ఉన్న ప్రాంతాల్లో టైల్స్ ఏర్పాటు చేయాలన్నారు. శంఖుమిట్ట నామాల పార్కు క్రింద ఉన్న ఖాళీ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించి మరింత అహ్లాదకరంగా తీర్చిదిద్ధాలని డిఎప్‌వో శ్రీనివాసులు రెడ్డిని ఆదేశించారు. తిరుమలలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్లను ఇంజినీరింగ్ అధికారులు ఈవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో గోపినాధ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, విజివో బాలిరెడ్డి, డెప్యూటీ ఈవోలు భాస్కర్, లోకనాధం, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఇఇ శ్రీహర్ష, ఇతర అధికారులు పాల్గొన్నారు.