గౌతు లచ్చన్న పై తపాలా కవర్ విడుదల..


Ens Balu
6
Srikakulam
2021-10-13 09:20:25

స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న పై తపాలా కవర్ విడుదల చేశారు. శ్రీకాకుళంలో బాపూజీ కలామందిర్ లో తపాలా శాఖ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సయుక్తంగా తపాలా కవర్ విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్  తపాలా కవర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ లచ్చన్న మహోన్నత వ్యక్తి అన్నారు. కొన్ని పరిస్థితుల రీత్యా కొంత మందికి అనుకున్న పేరు ప్రఖ్యాతులు రాకపోవచ్చు అన్నారు. లచ్చన్న గురుతుల్యులు, త్యాగ శీలి అన్నారు. రంగాను శ్రీకాకుళం జిల్లా నుండి పోటీ చేయించుట తన పదవిని త్యాగం చేశారని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉందని ఆయన వివరించారు. పోస్టల్ స్టాంప్ విడుదల వలన దేశ విదేశాల్లో గౌరవం లభిస్తుందని తద్వారా జిల్లా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని పేర్కొన్నారు. లచ్చన్న పూర్తిగా ప్రజా జీవితంలో ఉన్నారని, లచ్చన్నకు సర్దార్ బిరుదు రావడం జిల్లాకు గౌరవం దక్కిందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి లచ్చన్న అన్నారు. ప్రజా జీవితంలో కుంచితత్వంతో ఉండరాదని సూచించారు. లచ్చన్న చిన్న రాజకీయ నాయకులు కాదని కృష్ణ దాస్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లచ్చన్న విగ్రహాలు ఎక్కువగా ఉండడం ఆయన సేవల విలువ తెలుస్తోందని చెప్పారు. లచ్చన్న పోరాట యోధుడు, ఆదర్శవంతమైన నాయకుడు అన్నారు.

పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎర్రన్నాయుడు లచ్చన్నను ఆదర్శంగా తీసుకున్నారు. మన చరిత్ర, సంస్కృతిని, సాంప్రదాయాలను తెలుసుకునే అవకాశం అజాది కా అమృత్ మహోత్సవం పెట్టడం జరిగిందన్నారు. యువత అవగాహనకు ఇది దోహదం చేస్తుందన్నారు. లచ్చన్న విలువలు అపారమని, యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన యోధుడు అని పేర్కొన్నారు. చరిత్రను గుర్తిస్తే అది మనలను రక్షిస్తుందని ఆయన చెప్పారు. రైతుల కోసం మహాపోరాటం చేశారని ఆయన తెలిపారు. శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ చరిత్రలో కనుమరుగైన నాయకులను వెలుగులోకి తీసుకురావడానికి ప్రధాన మంత్రి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. బడుగు వర్గాలు, అక్షరాస్యత తదితర అంశాలపై పోరాడి వ్యక్తి లచ్చన్న అన్నారు. పోస్ట్ మాస్టర్ జనరల్ డా.ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అజాది కా అమృత్ మహోత్సవం, స్టాంపుల సేకరణలో భాగంగా తపాలా కవర్ విడుదల చేస్తున్నామన్నారు. స్వాతంత్ర యోధుల చరిత్రను భావితరాలకు తెలియజేయుటకు ఎంతో ఉయోగపడుతుందని చెప్పారు. రవి అస్తమించని బ్రిటీష్ దేశాన్ని స్వాతంత్ర సమర యోధులు గడ గడలాడించారని ఆయన పేర్కొన్నారు. బడుగు వర్గాల కోసం గౌతు లచ్చన్న ఎంతో పాటుపడ్డారని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలో గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలకు, వారసత్వానికి నిలయమని ఆయన వివరించారు. శ్రీముఖలింగం, శ్రీకూర్మం, తెలినీలాపురం వంటి చారిత్రక ప్రసిద్ధి పొందిన ప్రదేశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

పోస్టల్ సూపరింటెండెంట్ కె.కాంతారావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుని తపాలా కవర్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. లచ్చన్న కార్యదక్షతకు వచ్చిన బిరుదు సర్దార్ అని చెప్పారు. పోస్టల్ స్టాంప్ దేశ విదేశాలకు వెళుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, శాసన సభ్యులు కింజరాపు అచ్చన్నాయుడు, డా.బెందాళం అశోక్, మాజీ శాసన సభాపతి కే.ప్రతిభా భారతి, గౌతు లచ్చన్న కుమారులు గౌతు శ్యామ సుందర శివాజీ, మాజీ శాసన సభ్యులు కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీ దేవి, కూన రవి కుమార్, గ్రంధాలయ మాజీ అధ్యక్షులు పిరికట్ల విఠల్, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు చౌదరి బాబ్జీ, పి.శివ నాగేశ్వర రావు, గౌతు లచ్చన్న కుటుంబ సభ్యులు, పోస్టల్ సూపరింటెండెంట్ జనపాల ప్రసాద్, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.