పేద కుటుంబాల్లో పేదరికం రూపుమాపాలని ముఖ్య మంత్రి ధ్యేయమని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని పొందూరులో వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డ్వాక్రా మహిళలకు నమూనా చెక్కులను స్పీకర్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ వైయస్సార్ ఆసరా రెండో విడతలో భాగంగా పొందూరు మండలంలోని 1319 సంఘాలకు 9 కోట్ల 54 లక్షల రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది గా ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పేదరికం పోయి జీవన ప్రమాణాలు మెరుగు పడాలన్నారు. అవినీతి లేని పాలన అందించి పేదరికాన్ని పారద్రోలుతానని ప్రమాణ స్వీకారం రోజే చెప్పారని ఆయన తెలిపారు. రైతులకు వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించారని, రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చి రుణమాఫీ చేశారని అదేవిధంగా ఉచిత విద్యుత్తును అమలుపరిచారని గుర్తుచేశారు. సుదీర్ఘ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చుతూ ముఖ్య మంత్రి మంచి పాలన అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ముందు నిలబడి హామీ ఇచ్చామంటే అది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ కన్నా గొప్పది అని ఆయన అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పిల్లలకు మంచి విద్యని అందించాలని దానికి కావాల్సిన మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారని వివరించారు. పేదవానికి ఇళ్ళు ఇవ్వాలని ముఖ్య మంత్రి ఆశించారని, అయితే వివిధ కారణాల వలన జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. మహిళలు, రైతులు ఆర్థికంగా బలపడాలని వ్యాపారవేత్తగా తయారవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి బి.శాంతిశ్రీ, తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ కిల్లి ఉషారాణి, వైస్ ఎంపీపీ వండన శ్రీదేవి, జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, కొంచాడ రమణ మూర్తి, గాడు నాగరాజు, పొందూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రేగిడి లక్ష్మి , మార్కెట్ కమిటీ చైర్మన్ బడాణ సునీలు, లోలుగు శ్రీరాముల నాయుడు, గంట్యాడ రమేష్, తదితరులు పాల్గొన్నారు.