గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం మరింత వేగవంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు వివిధ సేవలకోసం అందించే వినతులను సచివాలయ సిబ్బంది త్వరగా పరిష్కరించాలని చెప్పారు. డెంకాడ మండలం మోదవలస గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బంది హాజరు, ప్రజల నుంచి పలు సేవల నిమిత్తం, పలు సంక్షేమ పథకాల మంజూరు కోరుతూ వచ్చిన వినతుల పరిష్కారం, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఆయా పథకాలు ఏవిధంగా ఎంత కాలంలో అందిస్తున్నారనే అంశాలపై కలెక్టర్ సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. సచివాలయ సిబ్బంది ఎవరు ఏయే విధులు నిర్వహిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలోని రిజిష్టర్లను, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హతలు తెలిపే చిత్రపటాలను పరిశీలించారు. గ్రామంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పరిస్థితిపై ఆరా తీశారు. అర్హులై వుండి టీకాలు వేయించుకోని వారు ఎవరైనా వున్నారా అని తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించాలని ఆదేశించారు.