పీహెచ్సీల్లో బయోమెట్రిక్ వేస్తేనే జీతం వస్తుంది..
Ens Balu
7
Kakinada
2021-10-14 13:29:23
రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీల్లోనూ నవంబర్ 1 నుంచి బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని బయోమెట్రిక్ లేనివారు తక్షణమే కొత్తవి కొనుగోలు చేసి ఏర్పాటుచేసు కోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ వైద్యాధికారులను ఆదేశించారు. పి.హెచ్.సీల్లోని సిబ్బంది విధులకు వచ్చినపుడు,వెళ్లే సమయంలో తప్పనిసరిగా బియోమెట్రిక్ అటెండన్స్ ఉండాలని, విధులకు హాజరుకాని రోజులకు జీతం చెల్లించేది లేదని తేల్చిచెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తరపున చేపడుతున్న కార్యక్రమాల అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కమీషనర్ గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖకు ఇవ్వని విధంగా వైద్య ఆరోగ్య శాఖకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులకు సకల సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. ఇన్ని సౌకర్యాలను ఏర్పాటుచేసినప్పటికి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెలుతున్నారని, ఇందుకు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరనే కారణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలకు వచ్చే రోగులకు అన్నివిధాల ఆదుకుని, వారికి పూర్తి భరోసాను ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దినపుడే ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెరుగుతుందని ఆ దిశగా పి.హెచ్.సి వైద్యులు,సిబ్బంది కృషిచేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న వైద్యులు,నర్సులు,లాబ్ టెక్నిషియన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లోఉండబోరని, మంచి అనుభవం, అర్హతలు కలిగిన సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉన్నారని ఆ భరోసా ప్రజలకు కలిగించాలని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో పి.హెచ్.సీల్లో ప్రసవాలు తక్కువగా జరిగాయని, ఇది సిబ్బంది నిర్లక్ష్యవైఖరికి నిదర్శమని అన్నారు. ఇకపై ఇటువంటివి పునరావృతం కారాదని, అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి 108 వాహనాలు ఉన్నాయని, అలాగే ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలను ఇంటికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు ఉన్నాయన్నారు. అలాగే గర్భిణి స్త్రీలకు అవసరమైన మందులను సకాలంలో అందజేసి, ప్రసవాలకు ఆసుపత్రులకు తరలించి, ప్రసవం అనంతరం ఇంటికి తరలించాల్సిన బాధ్యత ఆశావర్కర్లపై ఉందని, కానీ ఆ విధమైన చర్యలు తీసుకోక పోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందువలనే మాత, శిశు మరణాలు సంభవిస్తున్నాయని ఇకపై ఇటువంటివి జరగ రాదని, నిర్లక్ష్యం వహించిన అధికారులను విధుల నుండి తొలగించడానికి కూడా సిద్ధమని ఆయన హెచ్చరించారు. గ్రామంలోని గర్భిణీలు పి.హెచ్.సీల్లోనే ప్రసవాలు వేసుకునేలా, వారికి అవసరమైన మందులు, వైద్యం, భోజన వసతి, బేబీ కిట్స్ తదితర సౌకర్యాలు అందేలా వైద్యులు కృషిచేయాలని స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.గౌరీశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సంభవించిన మాత, శిశు మరణాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇకపై ఎటువంటి మాత,శిశు మరణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పి.హెచ్.సీలకు అవసరమైన మందులను ఇప్పటికే సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. సిబ్బంది లేనిచోట సిబ్బందిని సమకూరుస్తున్నామని వివరించారు. ప్రసవాలు పి.హెచ్.సీల్లోనే జరిగేలా ఆశా సిబ్బందికి ఆదేశాలు జారీచేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బగాది జగన్నాధరావు, బాల స్వాస్త్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి తదితరులు పాల్గొన్నారు.