అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చుదిద్దుతా..
Ens Balu
6
Srikakulam
2021-10-18 08:32:26
రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషిచేస్తానని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పిరియా విజయ పేర్కొన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ ఛైర్ పర్సన్ గా తన ఛాంబరులో ఆమె పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా కీలక భాద్యత తన భుజస్కంధాలపై ఉందని అన్నారు. నిత్యం జనబాహుళ్యంలో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ప్రజలకు అందించే అవకాశం తనకు కలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో జిల్లా ప్రజాపరిషత్ ఛైర్ పర్సన్ పదవిని కల్పించారని, ఆయన ఆశయసాధనకు నిత్యం కృషిచేస్తానని చెప్పారు. జిల్లాకు చెందిన మంత్రులు, ముఖ్య నేతలు, పార్లమెంటు, శాసనమండలి, శాసనసభ్యులందరినీ కలుపుకుంటూ జిల్లాను అభివృద్ధిపథంలో అగ్రగామిగా తీర్చు దిద్దుతానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ పదవిని తనకు అందించేందుకు కృషిచేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా, సీదిరి అప్పలరాజు, విశాఖ పార్లమెంట్ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులకు, జిల్లాప్రజాపరిషత్ ప్రాదేశిక సభ్యులకు ఆమె ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక సభ్యులకు, మండల అధ్యక్షులకు, ప్రజలకు, అధికారులకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని, అందరి నమ్మకాలకు అనుగుణంగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను జవాబుదారీతనంతో, పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా అన్ని గ్రామాల్లో జగనన్న సుపరిపాలనను అందించేందుకు సాయశక్తుల శ్రమిస్తానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయనని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. అక్షర క్రమంలో జిల్లా ముందు ఉన్నట్లే అభివృద్ధి పథంలో కూడా జిల్లాను ముందు వరసలో ఉండేవిధంగా ఆదర్శంగా నిల్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల మదిలో సుస్థిరస్థానం సంపాదించేందుకు కృషిచేస్తానని తెలిపారు. ఈ పదవిని కట్టబెట్టిన ప్రజలకు తామంతా రుణపడి ఉన్నామని, అర్హులకు అభివృద్ధి ఫలాలు అందించడంలో తాను బాధ్యత కల్గిన పాత్ర పోషిస్తానని స్పష్టం చేసారు. సిక్కోలు అభివృద్ధి కొరకు దూరదృష్టి కలిగిన నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారుల సలహాలు, సూచనలు తప్పక తీసుకుంటామని అన్నారు. ప్రజలకు మేలు జరిగేందుకు అహర్నిశలు శ్రమించి ముఖ్యమంత్రి నుంచి జిల్లాకు చెందిన ముఖ్యనేతల వరకు మన్ననలను పొందుతాననే విశ్వాసం తనకు ఉందని ఆమె ఈ సందర్భంగా వివరించారు. తొలుత జిల్లా ప్రజాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి జిల్లా ప్రజాపరిషత్ చైర్ పర్సన్ గా తొలి సంతకం చేయించి, దుశ్శాలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది అధ్యక్షురాలుకు పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు.