గ్రామ స్థాయిలో సచివాలయాలకు వచ్చే వినతులపై ప్రత్యేకంగా దృష్టి సారించి సాధ్యమైనంత వరకు గ్రామస్థాయిలోనే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి మళ్లీ వినతులు వచ్చి ఇక్కడ జాప్యం జరిగే పరిస్థితి వుండకూడదని స్పష్టంచేశారు. గ్రామస్థాయి నుంచి వచ్చే వినతులను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని చెప్పారు. ఏదైనా వినతిని సానుకూలంగా పరిష్కరించే అవకాశం లేని పక్షంలో ఏకారణంతో సంబంధిత దరఖాస్తును తిరస్కరిస్తున్నారో ఫిర్యాదు దారుకు తప్పనిసరిగా కారణం తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాలకు వస్తున్న వినతుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. జనన, మరణ ధృవపత్రాల జారీలో కొంత జాప్యం జరుగుతోందని, దీనిని నివారించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు ఏమేరకు అందుతున్నాయో తెలుసుకొనే సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. మండల ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని మండలాల్లో గ్రామాలను సందర్శించి నేరుగా ప్రజలతో మాట్లాడి ఆయా పథకాల అమలుపై తెలుసుకోవాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పై ఎవరికైనా అపోహలు ఉన్నట్లయితే వాటిని తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. సచివాలయాలకు అందుతున్న వినతుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు సోమవారం 85 వినతులు అందాయి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 12, డి.ఆర్.డి.ఏ.కు 15, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారికి 3, రెవిన్యూ శాఖకు సంబంధించి 50, పౌరసరఫరాల శాఖకు 5 వచ్చాయి. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన వినతుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్.మహేష్ కుమార్, మయూర్ అశోక్, జె.వెంకటరావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు కలెక్టరేట్ ఆడిటోరియంలో వినతులు స్వీకరించారు.