పొటాష్‌కు బదులు ప్రత్యామ్నాయ ఎరువులను వాడాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 1,23,650 హెక్టార్లమేర వరి పంట చిరుపొట్టదశలో ఉందని, దీనికి పొటాష్ మరియు ఎరువులు వేయాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 10,000 మెట్రిక్ టన్నుల పొటాష్(ఎంఓపి) ఎరువులకు గానూ 7,453 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిపదార్థాల కొరత కారణంగా, పొటాష్ ఎరువుల లభ్యత తక్కువగా ఉందని, అయినప్పటికీ జిల్లా అవసరాలకోసం ఈ నెలాఖరునాటికి సుమారు 600 మెట్రిక్ టన్నుల పొటాష్ వస్తుందని వివరించారు. ఈ పొటాష్(ఎంఓపి)కి ప్రత్యామ్నాయంగా 13-0-45 (పొటాషియం నైట్రేట్), 0-0-50 (సల్ఫేట్ ఆఫ్ పొటాష్) తదితర ప్రత్యామ్నాయ పొటాష్ ఎరువులను పిచికారీ చేయడం ద్వారా, అతితక్కువ ఖర్చుతోనే, ఎక్కువ ఫలితాలను సాధించవచ్చని సూచించారు. ఈ ప్రత్యామ్నాయ ఎరువులు రెండు రకాలూ రైతు భరోసా కేంద్రాలవద్దా, డీలర్లవద్దా తగినంత అందుబాటులో ఉన్నాయని, వీటి ధరలు కూడా కిలోకి రూ.110 నుంచి రూ.130 వరకు మాత్రమేనని తెలిపారు. ఒక లీటరు నీటికి 10 గ్రాములు చొప్పున వందలీటర్ల నీటిలో కలిపి ఎకరాకి వారం, పదిరోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. పూతదశలో ఉన్న వరిపంట పుష్పాలు సంపర్కదశలో ఉండే సమయం ఉదయం 8 గంటలు నుంచి 11 గంటలు కాబటి, ఈ సమయంలో ఎరువులను పిచికారీ చేయకూడదని, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటలు లోపు మాత్రమే పిచికారీ చేయాలని సూచించారు.
అంతర్జాతీయ కొరత కారణంగా, రబీకి అవసరమైన డిఏపి, ఎంఓపి ఎరువులకు ప్రత్యామ్నాయంగా, కాంప్లెక్స్ ఎరువులను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. సుమారు 3,148 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు రైతు భరోసా కేంద్రాలవద్దా, సహకార సంఘాలవద్దా, ప్రయివేటు డీలర్లవద్దా సిద్దంగా ఉన్నాయని తెలిపారు. డిఏపి, ఎంఓపి ఎరువులతో పోలిస్తే, కాంప్లెక్స్ ఎరువుల్లో పొటాష్, నత్రజని, భాస్వరం, గంధకం వంటి పోషకాలు చాలా ఎక్కువని, వీటివల్ల నేల సారం కూడా పెరుగుతుందని, చీడపీడలు తగ్గి, ఇవి పంటలకు ఎంతో మేలు చేస్తాయని, దిగుబడి పెరుగుతుందని పేర్కొన్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా చాలాతక్కువని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా, పొటాష్ ఎరువులకు బదులుగా వివిధ రకాల కషాయాలను, వృద్ది ద్రావకాలను వినియోగించాలని సూచించారు. వీటిని రైతు భరోసా కేంద్రాలవద్దా, ఎన్‌పిఎం షాపులవద్దా డ్రమ్ముల్లో తయారు చేయించి, విక్రయించేందుకు ఉంచడం జరుగుతోందని తెలిపారు. ఈ కోడిగుడ్లు, నూనెల ద్రావణం, జిల్లేడు కషాయం, పుల్లటి మజ్జిగ ద్రావణం, మీనామృతం తదితర వృద్ది ద్రావకాలను, కషాయాలను, సిబ్బంది చెప్పిన విధంగా, నిర్ణీత పద్దతిలో పిచికారీ చేయాలని కలెక్టర్ సూచించారు.