స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి..
Ens Balu
10
Kakinada
2021-10-18 11:37:05
స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్, జేసీ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, తదితరులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఇప్పటి వరకు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలు వాటి పరిష్కారం, రీఓపెన్ అర్జీల పరిష్కారంలో పురోగతిపై కలెక్టర్ హరికిరణ్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా మండలాల వారీగా త్వరితగతిన పరిష్కరించాలనన్నారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ శాఖల పరిధిలో ఉన్న కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతి వారం మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ కు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా ఆయా ప్రధాన కేంద్రాల నుంచి పాల్గొని ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ నెల 25 సోమవారం ఉదయం స్పందన కార్యక్రమంతో పాటు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రజల కొరకు ప్రత్యేకంగా నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి అధికారులు సిద్ధం కావాలన్నారు. ఈ గ్రీవెన్స్ లో ఎస్సీ, ఎస్టీ ప్రజల మాత్రమే తమ సమస్యలపై అర్జీలు అందించే విధంగా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పాల్గొని, ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉద్యోగ ఉపాధి కల్పన, పెన్షన్లు, ఉపకార వేతనం, బియ్యం, ఆరోగ్య శ్రీ కార్డుల మంజూరు, బీమా, భూముల సర్వే తదితరాలకు సంబంధించి సుమారు 397 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.