గోశాల నిర్వహణ, గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 30, 31వ తేదీల్లో తిరుపతిలో నిర్వహించనున్న గోసమ్మేళనం విజయవంతానికి ఆయా విభాగాల అధికారులు కృషి చేయాలని టిటిడి జెఈవో వీరబ్రహ్మం కోరారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం ఈ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ గోసమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీలు ఏర్పాటు చేశామని, అధికారులు ఇప్పటినుంచే ముందస్తు ఏర్పాట్లకు సిద్ధం కావాలని సూచించారు. ఇందులో తిరుమల రిసెప్షన్, తిరుపతి రిసెప్షన్, అకామిడేషన్, రిజిస్ట్రేషన్, కార్యక్రమ నిర్వహణ, ప్రచారం, ఫుడ్ అండ్ హాస్పిటాలిటి, రవాణా, ఇన్‌ఫ్రాస్టక్చర్, స్టేజ్ డెకరేషన్, ఎగ్జిబిషన్, దర్శనం, సన్మాన కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మొదటి రోజు వెయ్యి మంది, రెండో రోజు వెయ్యి మంది రైతులు విచ్చేస్తారని, వీరందరికీ తిరుచానూరు పద్మావతి నిలయం, తిరుపతిలోని 2, 3 సత్రాలు, ఎస్వీ విశ్రాంతిగృహం తదితర ప్రాంతాల్లో బస ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల, తిరుపతిలోని అన్నదానం డెప్యూటీ ఈవోలు ఆహారం శుచిగా, రుచిగా అందించాలని ఆదేశించారు. స్వామీజీలను ఆహ్వానించే విషయంలో ధార్మిక ప్రాజెక్టుల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రెండు రోజుల కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఆధ్వర్యంలో రికార్డు చేయాలని, సమాచారాన్ని క్రోడీకరించి సావనీర్ రూపొందించేందుకు చీఫ్ ఎడిటర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. స్టేజి వద్ద సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలన్నారు. ఈ సమావేశంలో యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ మరియు టిటిడి బోర్డు మాజీ సభ్యులు శివకుమార్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి విజయసారథి, గోశాల సంచాలకులు డాక్టర్ హరనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.