నరేగా పనుల ప్రతిపాదనలు పంపాలి..


Ens Balu
9
Vizianagaram
2021-10-18 12:42:37

ఉపాధి హామీ పధకం క్రింద చేపట్టనున్న పనుల కోసం అన్ని శాఖలకు చెందిన పనుల ప్రతిపాదనలను ఈ నెల 22 లోగా  డుమా పి.డి. కి పంపాలని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు.  2022-23 కు సంబంధించిన పనులను  నరేగా నుండి నవంబర్ 15 లోపల గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని  పంపవలసి ఉన్నదని తెలిపారు.  సుమారు 500 కోట్ల రూపాయల పనులు నరేగా ద్వారా జరగడానికి అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని  ప్రభుత్వ శాఖలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో ఉపాధి హామీ పనులు,  సచివాలయాల తనిఖీలు, హాజరు , గృహాల వన్ టైం సెటిల్మెంట్ , సుస్థిర అభివృద్ధి తదితర అంశాల పై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పధకం  క్రింద ఇప్పటికే 11 వేల పనులను ప్రతిపాదించడం జరిగిందని,   అయితే ఇంకను ముఖ్యమైన శాఖల ద్వారా ప్రతిపాదనలు రావలసి ఉందని అన్నారు.   హౌసింగ్,  పంచాయతి రాజ్, డి.పి.ఓ, మత్స్య శాఖ, ఆర్.డబ్ల్యు.ఎస్., విద్య శాఖ, పశు సంవర్ధక, అటవీ  తదితర శాఖల నుండి ప్రతిపాదనలు రావాలన్నారు. చెక్ డాం లు ,  స్మశానాల నిర్మాణాలు,  కాంపౌండ్ వాల్స్,  రహదారులు,  ఇంకుడు గుంతలు, నర్సరీలు వ్యవసాయ బావులు, పశువుల షెడ్లు, పశు గ్రాసం అభివృద్ధి తదితర అంశాలను ప్రతిపాదనలో చేర్చవలసి ఉందన్నారు.  ఇంకను ఏవైనా  ప్రజా అవసరాలకు ఉపయోగ పడే పనులున్నా  ప్రతిపాదిన్చాలన్నారు.  గతం లో ఇండ్ల కోసం రుణాలు తీసుకొని చెల్లించలేని లబ్ది దారుల నుండి వన్ టైం సెటిల్ మెంట్ క్రింద చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని,  జిల్లాలో 3.4 లక్షల మంది  లబ్ది దారులు ఉన్నారని, వారందరిని క్షేత్ర స్థాయి లో తనిఖీ లు చేసి జాబితాను సిద్ధం చేయాలనీ ఆదేశించారు.  ఇందుకోసం నియోజక వర్గాల ప్రత్యేకా ధికారులు, మండల ప్రత్యేకాధి కారులు , సచివాలయాల సిబ్బంది  బాధ్యత తీసుకొని వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.   నీతీ అయోగ్ సుస్థిర అభివృద్ధి  సూచీలు  కొన్ని రంగాల్లో వెనకబడి  ఉన్నాయని, అధికారులంతా  ఈ సూచీ ల పై దృష్టి పెట్టాలని  అన్నారు.  విద్యా ప్రమాణాలు,  జెండర్ సమానత, రైట్ టు ఎంప్లొయ్మెంట్, స్కూల్ డ్రాప్ ఔట్స్ ,  టాయిలెట్ల వినియోగం, హ్యూమన్ ట్రాఫికింగ్ తదితర అంశాల్లో వెనకబడి ఉన్నామని, ఈ రంగాల్లో ఆయా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.  కోవిడ్ వలన కొన్ని రంగాల్లో వెనకాబడి  ఉండవచ్చని, అండర్ రిపోర్టింగ్ కూడా కొంత కారణం కావచ్చని, వీటిని నోడల్ అధికారి పరిశీలించాలని అన్నారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు  డా. జి.సి కిషోర్ కుమార్,  జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా  అధికారులు పాల్గొన్నారు.