స్వచ్ఛ సంకల్పదీక్షలో భాగస్వాములు కండి..


Ens Balu
5
Kakinada
2021-10-19 07:57:02

పరిసరాల పారిశుద్యాన్ని నిత్య జీవన శైలిగా మలచుకుని ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ జగనన్న స్వచ్చ సంకల్ప దీక్షలో భాగస్వాములు కావాలని  జిల్లా ఇన్ చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర రెవెన్యూ, రిజిష్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సెంటరులో జిల్లాలో 100 రోజుల పాటు నిర్వహించ నున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ (CLAP) కార్యక్రమాన్ని  జిల్లా ఇన్ చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర రెవెన్యూ, రిజిష్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణగోపాలకృష్ణ, కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగాగీతలతో కలిసి ప్రారంభించారు.  అలాగే క్లాప్ లోగోను ఆవిష్కరించి, స్వచ్చాంద్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు కేటాయించిన 155 హైడ్రాలిక్ పవర్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించి, గ్రామపంచాయితీలకు అందజేశారు.  ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టనంలో పరిశుబ్రత వెల్లివిరిసే ఆరోగ్యవంతమైన ఆహ్లాదకర పరిసరాలను తీర్చిదిద్దేందుకు గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 2వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని  ప్రారంభించారన్నారు.  ఈ కార్యక్రమం క్రింద   గ్రామీణ, పట్టన ప్రాంతాల్లో  పటిష్టమైన పారిశుద్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర  ప్రభుత్వం సుమారు 100 కోట్ల నిధులతో  వెయ్యి పారిశుద్య వాహనాలను  కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు అందిస్తోందని,  ఇందులో భాగంగా 155 వాహనాలను తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు.  ప్రజా భాగస్వామ్యంతో యాంత్రికంగా ఇంటింటి నుండి సేకరణ, వ్యర్థాల శుద్ది, ప్రతి ఇంటిలో కంపోస్ట్ ఎరువుల తయారు చేసేలా ప్రోత్సాహం స్వచ్ఛ సంకల్పం ప్రధాన అంశాలన్నారు.  వ్యాధుల నివారణ, ఆరోగ్య పరిరక్షణకు పరిసరాల పారిశుద్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, వ్యర్థాల నియంత్రణ, శుద్దితో పాటు వాటిని ఎరువుగా మార్చి ఆదాయ వనరుగా మార్చవచ్చునన్నారు.  ప్రతి కుటుంబం ఇంటి వ్యర్థాలను కేంపోస్ట్ ఎరువు తయారు చేసుకుని మొక్కలకు వాడుకోవాలని ఆయన సూచించారు.  ప్రతిష్టాత్మమైన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ప్రజలు అందరూ భాగస్వామ్యం వహించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాతలుగా నిలవాలని మంత్రి కృష్ణదాస్ కోరారు. 
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బృహత్ సంకల్పాన్ని చేపట్టారన్నారు.  క్లాప్ కార్యక్రమం క్రింద కేటాయించిన వాహనాలను ఆయా గ్రామాల్లో పంచాయతీ పాలక వర్గాల, సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.   చాలా గ్రామాల్లో గుండా ప్రవహిస్తున్న కాలువ గట్లపై ప్రజలు చెత్తను కుప్పలుగా వేస్తున్నారని, వీటి వల్ల వర్షాకాలం సీపేజి వల్ల మంచినీటి కాలువలు కూడా మురుగు కాల్వలుగా మారుతున్నాయన్నారు.  అలాగే  జనావాసాల్లో పందులు స్వేచ్చగా తిరుగుతూ మురుగు కాల్వలను ద్వంసం చేస్తున్నాయని, వీటి నియంత్రణకు పెంపకందారులను ప్రత్యామ్నాయ ఉపాది చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు.  జిల్లాలో లూజ్ సాయిల్ నేలలు కావడంతో తడి, చెమ్మ ఎక్కవ కాలం నిలిచి ఉండి మురుగు సమస్య ఎదురౌతోందని, దీని నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు.
    రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ  రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ను సాధించవచ్చునని ఉద్దేశంతోనే  జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి అడుగు వేశారన్నారు. గ్రామాల్లో ప్రజలు తమ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలలో చైతన్యం తీసుకురావడంతో పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ఒక మహోద్యమంలా సాగాలన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన పారిశుద్ధ్య వ్యవస్థల పటిష్ట అమలు చేసినందుకు ఇచ్చిన నిర్మల్ గ్రామీణ్ పురస్కారాల్లో తూర్పు గోదావరి జిల్లా ఎప్పుడూ అగ్ర స్థానాల్లో నిలిచేదని మంత్రి వేణు గోపాల కృష్ణ గుర్తుచేస్తూ, ఆదే స్పూర్తితో  జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రధానంగా రోడ్లపై చెత్త వేసే గ్రామాలను గుర్తించి అక్కడ ప్రజలలో మార్పు తెచ్చేందుకు ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి వేణుగోపాల కృష్ణ అధికారులకు సూచించారు.
      కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన స్వచ్ఛ సంకల్పం నూరు శాతం సాఫల్యత ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమన్నారు.  దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే పారిశుధ్యం మెరుగుపరచుకోవడం చాలా అవసరమని, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలని ఎంపీ తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ రావు గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పరిచేందుకు క్లాప్ కార్యక్రమం ద్వారా సుమారుగా 11.20 కోట్ల వ్యయంతో 155 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందన్నారు. వీటిని అమలాపురం డివిజన్ కు -39, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం డివిజన్లకు -49, పెద్దాపురం డివిజన్ కి - 31, కాకినాడ డివిజన్ కి-35, రంపచోడవరం డివిజన్ కు-1 చొప్పున వాహనాలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ వాహనాలు  ఆయా గ్రామాలకు చేరుకుని బుధవారం నుంచి చేత్త సేకరణ నిర్వహిస్తాయని ఆయన తెలిపారు.  కార్యక్రమంలో జడ్.పి సిఈఓ ఎన్.వి.వి.సత్యన్నారాయణ సభికులచేత జగనన్న స్వచ్చ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. 
       ఈ కార్యక్రమంలో  కాకినాడ, పి.గన్నవరం శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొండేటి చిట్టిబాబు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)డా.జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) కీర్తి చేకూరి,  కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చోడిపల్లి వెంకట సత్య ప్రసాదు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆర్. చంద్రకళ దీప్తి, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.వి నాగేశ్వరనాయక్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ గ్రామీణం, కరప మండలాల జడ్పీటీసీ సభ్యులు ఎన్.రామకృష్ణ, వై.సుబ్బారావు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.