రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మన ప్రాంతాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామన్నారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు.. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ చిత్రపట్టానికి పూలమాల వేసి జోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు, ప్రజల చేత మంత్రి స్వచ్ఛ సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెత్త తరలించేందుకు జిల్లాకు వచ్చిన వాహనాలను మంత్రి, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. ఆరోగ్య వంతమైన సమాజం నిర్మించేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎవరికి వారే బాధ్యతగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలోని అవసరాల దృష్ట్యా మున్సిపాలిటీలకు 62, గ్రామ పంచాయతీలకు 62 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. వీటి ద్వారా ప్రతి పట్టణం, పల్లె పరిశుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛ విజయనగరం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చివరిగా స్వచ్ఛ సంకల్పం తాలూక పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, ఎమ్మెల్సీలు సురేశ్ బాబు, రఘువర్మ, జిల్లా పరిషత్ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో సుభాషిణి, మున్సిపల్ కమిషనర్ వర్మ, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.