వాల్మీకి రామాయణం ప్రపంచానికే ఆదర్శం


Ens Balu
13
Srikakulam
2021-10-20 07:26:54

శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్  పేర్కొన్నారు. వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ తో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించుకోవలసిన తరుణమిది అని పేర్కొన్నారు. వాల్మీకి పూర్వశ్రమ జీవితం గురించి రామాయణంలోని ఉత్తరకాండలో వివరించబడిందని అన్నారు. ఆ కథనం ప్రకారం వాల్మీకి బందిపోటుగా బాటసారుల నుండి సొత్తును దోచుకొని జీవితం సాగించేవాడని తెలిపారు. ఒకనాడు నారద మహర్షిని కూడా దోచుకోబోగా నారదడు ఈ దోపిడి ద్వారా వచ్చిన పాపాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా అని అడిగాడని, దానికి భార్య నిరాకరించడంతో ఆత్మసాక్ష్యాత్కారం పొంది నారదుడిని క్షమాపణ కోరి జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు అని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. నారదుని రామ మంత్ర ఉపదేశంతో వాల్మీకి ఉన్నచోటనే తపస్సమాధిలోకి వెళ్లాడని, వల్మీకం నుండి ఉద్భవించినందున వాల్మీకి అయ్యాడని ఉపముఖ్యమంత్రి వివరించారు. అటువంటి మహర్షుల జీవిత చరిత్రలు మనందరికి నేడు ఆదర్శమని, తాను రచించిన రామాయణం యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయమని  ఉపముఖ్యమంత్రి స్పష్టం చేసారు.  

        శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించుకోవడం, ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఆయన రచించిన రామాయణం దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. ప్రపంచంలోని కొన్ని దేశాలు రామాయణాన్ని వారి బాషలోకి అనువదించుకొని మరీ చదువుతున్నారని, రామయణంలోని ప్రతి ఘట్టం మనందరకీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తండ్రి మాటకోసం రాజ్యాధికారాన్నే వదలిన తనయుడుగా రాముడు, అన్నకోసం సర్వభోగాలను వదలిన తమ్ముడుగా లక్ష్మణుడు, భర్తతోనే తన జీవితమంటూ అడవులకు సైతం వెళ్లిన సతీమణీగా సీత ఇలా అన్ని పాత్రలు మనకు ఆదర్శంగా ఉంటాయని, అందుకే ప్రతీ ఒక్కరూ రామాయణాన్ని పవిత్ర గ్రంధంగా పూజిస్తారని గుర్తుచేసారు. అటువంటి రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందని సభాపతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి డా. కిల్లి కృపారాణి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి పిరియా విజయ, కళింగకోమటి కార్పొరేషన్ అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, మాజీ పురపాలక సంఘ అధ్యక్షురాలు మెంటాడ వెంకట పద్మావతి, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, బి.సి.సంక్షేమ శాఖాధికారి జి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.