చిరు వ్యాపారులకు , సంప్రదాయ వృత్తుల వారికి జగనన్న తోడు ఎంతో బాసటగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లుతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న తోడు నగదు లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలోకి బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారులకు ఉపాధి కల్పనలో ఈ కార్యక్రమంతో ప్రభుత్వం తరఫున చిరు వ్యాపారులపై వడ్డీ భారం పడకుండా ఆసరాగా ఉంటుందని చెప్పారు. తోపుడు బళ్ళు, బడ్డీలపై టిఫిన్ వ్యాపారం, కూరగాయలు వ్యాపారం, వీధుల్లో తిరుగుతూ అమ్ముకొనే వారికి బ్యాంకుల నుండి రుణాలు ఇచ్చేందుకు సహాయ సహకారాలు ఉండవని, పూచీ లేనందు వలన బ్యాంకులు రుణాలు ఇవ్వరని తెలిపారు. ఇలాంటి సమయంలో వడ్డీ వ్యాపారుల నుండి అప్పులు తీసుకొని రోజు వారీ వచ్చే లాభాన్ని వడ్డీ వ్యాపారులకు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని , ఇక పై డిసెంబర్, జూన్ నెలలో సంవత్సరానికి రెండు సార్లు ఈ కార్యక్రమం ఉంటుందని, రుణాలు తీసుకున్న తర్వాత తిరిగి పూర్తి గా చెల్లించిన మీదట రుణం మళ్లీ తీసుకోవచ్చునని చెప్పారు. సకాలంలో అప్పులు చెల్లించేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. తీసున్న రుణంను టైం ప్రకారం చెల్లించాలని, ఒకవేళ కట్టకపోతే డ్యూ ఉంటుందని రుణం పొందుటకు కులం, మతం, పార్టీ లేదని అర్హులందరికి ఈ వర్తిస్తుందని వివరించారు. ఈ పధకం క్రింద జిల్లాలో 22,879 మందికి 79.51 లక్షల రూపాయలు లబ్ది చేకూరింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పట్టణాభి వృద్ధి, మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా.మహేష్ కుమార్, డి.ఆర్.డి.ఏ పి.డి అశోక్, మెప్మా పి.డి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జగనన్న తోడు లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు.