అయ్యవార్లను అధిక భక్తులు దర్శించుకోవాలి..
Ens Balu
8
Tirumala
2021-10-20 13:44:45
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆలయాలను ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని జెఈఓ శ్రీ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ఆలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించామని, వారు చక్కగా విధులు నిర్వహించి అభివృద్ధికి దోహదపడాలని కోరారు. రాబోయే ఆరు నెలల్లో ఆలయాల వారీగా అభివృద్ధిని చేసి చూపాలన్నారు. ఆలయాల స్థలపురాణం, ప్రాశస్త్యం భక్తులకు తెలిసేలా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి సప్తగిరి మాసపత్రిక, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, సామాజిక మాధ్యమాలు, పత్రికలు, ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. టిటిడి వెబ్ సైట్ లో ఆలయాల స్థల మహత్యం, చరిత్ర, వసతులు ఇతర విషయాలను వివరంగా పొందుపరచాలని, తద్వారా సుదూర ప్రాంతాల భక్తులు సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పారు. ముఖ్యంగా సంబంధిత ఆలయాల్లో భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు ఉండేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సీనియర్ అధికారులు ఆయా ఆలయాలను సందర్శించినప్పుడు చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎఫ్ఎ అండ్ సిఎఓ బాలాజి, న్యాయాధికారి రెడ్డప్ప రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, డెప్యూటీ ఈఓ జనరల్ రమణ ప్రసాద్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.