కాకినాడ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కాకినాడ నగర పాలక సంస్థ అహర్నిశలు కృషి చేస్తుందని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ నగరంలోని పారిశుద్ధ్య కార్యకలాపాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్లకు ఇరువైపులా ఎటువంటి వ్యర్థాలు ఉండకూడదని పారిశుద్ధ్య కార్మికులకు ఆదేశాలు జారీ చేశారు. నగరవాసులు కూడా రోడ్లకు ఇరువైపులా ఎటువంటి వ్యర్థాలను వేయకూడదని, ఎటువంటి ఆక్రమణలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పారిశుధ్య కార్మికులు వ్యర్ధాల సేకరణకు రాకపోతే 18004250325 నెంబరుకు ఫోను చెస్తే 24 గంటల లోపల పారిశుధ్య కార్మికులు ఇంటికే వచ్చి వ్యర్ధాలను సేకరిస్తారని తెలిపారు. దుకాణదారులకు డస్ట్ బిన్ ను తప్పనిసరిగా షాపు ముందు ఉంచాలని ఆదేశాలు జారీచేశారు. స్థానికులు అందరూ పర్యావరణ పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం హర్షదాయకమని పేర్కొన్నారు. కొంత శ్రద్ధతో తడి, పొడి, హానికర వ్యర్ధాలను విడివిడిగా ఇవ్వడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్ తరాలను భద్రపరిచగలమని కమిషనర్ గారు స్థానికులకు విజ్ఞప్తి చేశారు.