సీఎం జగన్ కు మహిళలు అండగా నిలవాలి..


Ens Balu
3
Vizianagaram
2021-10-22 15:24:13

అన్నివర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన సుభిక్షంగా ఉందని, రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖామంత్రి తానేటి వనిత కొనియాడారు. మహిళలకు ఒక అన్నగా, అండగా ఉంటూ, వారిని ఆర్ధికంగా, సామాజికంగా,  రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్.కోట మండలం గోపాలపల్లిలో రూ.7.5 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని, శుక్రవారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సామూహిక శీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వనిత మాట్లాడుతూ, మహిళల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అని, ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని స్పష్టం చేశారు. గర్భిణులు, పిల్లలకు పోషకాహారం అందించేందుకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం రూ.1800 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. నిరంతరం ప్రజా శ్రేయస్సే లక్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి పై, ప్రతిపక్ష టిడిపి నాయకులు అవాకులు, చెవాకులు ప్రేలుతూ, సభ్య సమాజం సిగ్గు పడే రీతిలో అసభ్యకరంగా దూషిస్తున్నారని అన్నారు. ప్రజల్లో పట్టు కోల్పోయిన టిడిపి, తమ ఉనికి చాటుకోడానికే  ఇలా వ్యవహారిస్తోందని   విమర్శించారు. డ్వాక్రా మహిళలను రుణ మాఫి పేరిట గత ప్రభుత్వం చేసిందని విమర్శించారు. ఇటీవలే రెండో విడత ఆసరా విడుదల చేయడంతో, మహిళలకు ప్రభుత్వం పై మరింత నమ్మకం, అభిమానం పెరిగాయని అన్నారు. మహిళలంతా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అండగా నిలవాలని మంత్రి కోరారు.   ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే దక్కిందన్నారు. ఇంతటి మహిళా పక్షపాతిని ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. విద్య, వైద్యాన్ని చంద్రబాబు కార్పోరేటీకరణ చేస్తే.... ఆ రెండింటినీ జగన్మోహనరెడ్డి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించిన, దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రమేనని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఆర్డిడి చిన్మయి, పిడి ఎం.రాజేశ్వరి, ఆర్డీవో బిహెచ్ భవానీశంకర్, జెడ్పిటిసి ఎం.వెంకటలక్ష్మి, వైస్ ఎంపిపి ఐ.సుబ్బలక్ష్మి, వైసీపీ నాయకులు ఐ.రఘురాజు, ఎంపిడివో శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐసిడిఎస్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.