కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలో 100 కోట్ల మైలురాయి దాటిందని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాథరావు పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మరియు సిబ్బందితో కలిసి కేక్ కటింగ్ చేసి తమ సంతోషాన్ని పాలుపంచుకున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో జరగని విధంగా మన దేశంలో వేక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరిగిందని, ఇప్పటికే 100 కోట్ల మైలురాయిని దాటామని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.జగన్నాథరావు గుర్తుచేసారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచంలోనే మనదేశం తొలిస్థానంలో ఉందని వైద్య సిబ్బందితో తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. దీనికి సహకరించిన వైద్య శాఖ, ఇతర శాఖల సిబ్బంది మరియు ఇంతటి ఘన విజయానికి కారణమైన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. వ్యాక్సినేషన్ తొలి రోజుల్లో ప్రజలు కొంత మేర భయబ్రాంతులకు గురైనప్పటికీ అనతికాలంలోనే ప్రజల్లో అవగాహన పెరిగి ముందుకు వచ్చారని, తద్వారా 100 కోట్ల మైలురాయిని దాటడం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని అతిత్వరలో శతశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. దేశంలో , రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని అమలుచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. జిల్లాలో మొదటి డోసు 16 లక్షల 9వేల 662 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని, రెండవ డోసు 8 లక్షల 41 వేల 484 మందికి వేయడంతో ఇప్పటివరకు 24 లక్షల 51 వేల 146 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని, త్వరలోనే జిల్లాలో కూడా శతశాతం వ్యాక్సినేషన్ జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. కె.అప్పారావు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు స్వరాజ్యలక్ష్మీ, అర్బన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. జె.కృష్ణమోహన్ , వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.