విజయనగరం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, మార్కెటింగ్ చేసుకోడానికి అనుకూలమైన వాతావరణం ఉందని, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికీ అన్ని రకాలుగా చేయూత నివ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తెలిపారు. అందుకు సరైన ప్రతిపాదనల తో , సంబంధిన డాక్యుమెంట్లతో పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి ఉంది , అవకాశాలు ఉన్నాయి కాని ఏ ఏ పరిశ్రమలకు ఎలాంటి మార్కెటింగ్ ఉంటుందనే అంశాల పై కూడా అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్, గిరిజన ఉత్పతులు , చేనేతలు, చేతి వృత్తులు, చిరు ధాన్యాల గ్రేడింగ్, ఆర్గానిక్ ఉత్పతులు , మాంగో ప్రాసెసింగ్, జనప నార, తేనే, కూరగాయల ఉత్పతులకు సంబంధించిన పరిశ్రమలకు ఎక్కువగా మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని, ఇందులో తక్కువ పెట్టుబడి తో ప్రారంభించవచ్చని అన్నారు. బ్యాంకర్స్ తో ఉన్న సమస్యలను పరిస్కారానికి ఈ నెల 28 న లీ పారడైస్ లో లోన్ మేళ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు హాజరయితే, బ్యాంకర్ లతో ముఖ ముఖి మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో విశాఖపట్నం నుండి హాజరైన ప్రముఖ వాణిజ్య వేత్త , ఛాంబర్ అఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు సాంబశివరావు మాట్లాడుతూ కంటకపల్లి లో 40 ఎకరాల్లో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయితే ఆ స్థలానికి రహదారులు, విద్యుత్, నీరు తదితర సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ ను కోరారు. మోటార్ వాహనాల అవసరత ఎక్కువగా ఉందని, అయితే డ్రైవర్ల కొరత వలన ఆ ఫీల్డ్ పెద్దగా అభివృద్ధి కావడం లేదని అన్నారు. కలెక్టర్ స్పందిస్తూ డ్రైవింగ్ స్కూల్ ద్వారా హెవీ వెహికల్ శిక్షణలు ఇచ్చి డ్రైవర్ లను తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా డిమాండ్ ఉన్న కోర్స్ లకు శిక్షణలు అందించడం జరుగుతుందని, ఇలాంటి శిక్షణలు పొందిన వారికి త్వరగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
డిక్కీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి వర్గాల వారికీ యూనిట్ల స్థాపనకు బ్యాంకు గ్యారంటీ లతో పాటు సేల్ డీడ్ లు అడుగుతున్నారని, అందువలన ఆసక్తి ఉన్నప్పటికీ యూనిట్ ల స్థాపనకు ముందుకు రావడం లేదని అన్నారు. కలెక్టర్ స్పందిస్తూ అజెండా లో పెట్టి ఎస్.ఎల్.బి.సి లో ఉన్న నిబంధనలను చర్చించి , బ్యాంకర్ లతో మాట్లాడి తగు పరిష్కారాన్ని కనుగొంటామని అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ సెప్టెంబర్ నుండి నేటి వరకు జిల్లాలో సింగల్ డెస్క్ పోర్టల్ లో 55 దరఖాస్తులు అందాయని, 33 దరఖాస్తులు అనుమతి పొందాయని , 20 దరఖాస్తులు పలు కారణాలతో పెండింగ్ ఉన్నాయని, 2 దరఖాస్తులు తిరష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ లు డా. మహేష్ కుమార్, జే. వెంకట రావు, ఎం.ఎస్.ఎం.ఈ , స్టేట్ ఫైనాన్సు కార్పొరేషన్, స్టీల్ ప్లాంట్ , ఫాప్సి, డిక్కీ నుండి ప్రతినిధులు, కమిటి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.