విజయనగరం జిల్లాలో ఆక్వాకల్చర్ పరిశ్రమలను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఎన్.నిర్మలకుమారి పేర్కొన్నారు. శనివారం విజయనగరంలో ఆక్వా కల్చర్ సాగు, పరిశ్రమలు, అభివ్రుద్ధి తదితర అంశాలపై హేచరీ యజమానులు, మత్స్యకార రైతులు, సీడ్ డీలర్లతో జిల్లా స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం ఆక్వా రంగ అభివృద్ధికి చాల కృషి చేస్తుందన్నారు. మత్స్యశాఖ కమిషనర్ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా ఆక్వారంగ పరిశ్రమలను అభివ్రుద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా చేప, రొయ్యల మేత సరఫరా, APSADA చట్టం ద్వారా ఆక్వా కల్చర్ సాగు, ఇతర సంభందిత కార్యకలాపాలకు అనుమతులు ప్రభుత్వం సులభతరం చేసిందన్నారు. పీనియస్ మొనోడాన్ రొయ్య పిల్ల ఉత్పత్తి, సరఫరాపై నియంత్రణ, వివిధ సైజుల గల రొయ్యలకు తగినట్లు ధరల నిర్ణయం, నియంత్రణ వంటి అంశాల్లో కూడా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అంతేకాకుండా ఆక్వా సాగు చేస్తున్న ప్రతీ ఎకరాను ఇ-క్రాప్ లో నమోదు చేసి ప్రభుత్వ ద్వారా వచ్చే సదుపాయాలకు మార్గం సుగమం చేస్తున్నట్టుఆమె వివరించారు. ప్రతి సచివాలయానికి ఒక మినీ ఫిష్ వెండింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసి వినియోగదారుల వద్దకే నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను చేరవేసి తద్వారా చేప, రొయ్యల తలసరి వినియోగం పెంపుదలకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది, గ్రామ మత్స్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు.