ఓటిఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి..
Ens Balu
3
Vizianagaram
2021-10-27 13:53:56
సచివాలయ పరిధిలోని ప్రజలకు అత్యుత్తమ సేవలందించే దిశగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా సిబ్బంది కృషిచేయాలన్నారు. కోవిడ్ నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు టీకాయే మార్గమని, అందువల్ల ప్రతిఒక్కరూ కోవిడ్ టీకా తీసుకొనేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. నగరంలోని ఉల్లివీధి-2 వార్డు సచివాలయాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాక్సినేషన్ పరిస్థితిపై ఆరా తీశారు. సచివాలయం పరిధిలో ఇంకా అర్హులైన వారిలో ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకోలేదని తెలుసుకొని వారందరినీ తక్షణం వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశించారు. సచివాలయ రికార్డులను పరిశీలించి ఇ-సేవ వినతుల పరిష్కారంపై తెలుసుకున్నారు. గృహాల లబ్దిదారులకు నామమాత్రపు ధరతో హక్కులు కల్పించే ఓ.టి.ఎస్.పథకంపై సచివాలయ పరిధిలో చేసిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. ప్రజల్లో దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరై చిత్తశుద్దితో సేవలందించాలని హితవుపలికారు.