శ్రీకాకుళం జిల్లా పొందూరులో మినీ ఖాదీ క్లస్టర్ ప్రతిపాదనలు సిద్ధమైంది. ప్రాథమికంగా మూడు మినీ ఖాదీ క్లస్టర్ లను ఏర్పాటు చేయుటకు చేనేత జౌళి శాఖ ప్రతిపాదనలు తయారు చేశారు. అందులో 2 పొందూరులో, ఒకటి తోలాపిలో ఏర్పాటు చేయుటకు ప్రతిపాదించారు. ఒక్కో మినీ క్లస్టర్ కు రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం కాగా కేంద్ర ప్రభుత్వం 90 శాతం సహాయం అందిస్తుంది. లబ్ధిదారులు పది శాతం మాత్రమే వాటాగా పెట్టాల్సి ఉంటుంది. మినీ క్లస్టర్ ప్రాజెక్టు వలన చేనేత కార్మికులకు చేనేత(వీవింగ్), డయింగ్ /డిజైనింగ్, ఐటి/మేనేజీరియల్ రంగాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ లభిస్తుంది. శిక్షణా కాలంలో రోజుకు 300 రూపాయలు స్టైపెండ్ కూడా అందించడం జరుగుతుంది. "సమర్థ" పథకం క్రింద నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. మగ్గాలు, ఆధునిక పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్త్రాల వివరాలు, తదితర సమాచారం తెలుస్తుంది. ఆధునిక డిజైన్లను ఆవిష్కరించేందుకు డిజైన్ డెవలప్మెంట్ అధికారిని నియామకం జరుగుతుంది. వీటన్నిటితో వేతనాలు పెరుగుదల వచ్చి ఆర్థికంగా, సామాజికంగా చేనేతకారులకు ఉపయోగపడుతుంది. రాష్ట్ర జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ లలో పాల్గొనే అవకాశాలు పెరుగుతుంది. సమగ్రమైన అభివృద్ధికి సహకారం అందుతుంది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సొంత స్థలం కలిగి ఉన్న చేనేతకారులు వ్యక్తిగత వర్క్ షెడ్ ను నిర్మించుటకు రూ.1.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఇందులో 75 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 25 శాతం లబ్ధిదారు భరించాలి. 1000 చదరపు మీటర్ల లో ఉమ్మడి వర్క్ షెడ్ నిర్మాణానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుంది.ఇందులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. 10 శాతం లబ్దిదారులు భరించాలి. ఆమదాలవలస నియోజకవర్గంలో 5, 6 మినీ క్లస్టర్ లు ఏర్పాటు చేయుటకు అవకాశం ఉంది. ఇందులో మొదటగా మూడు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదిత మినీ క్లస్టర్ లపై శుక్రవారం పొందూరులో అవగాహన కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రమించే నిత్య కార్మికుడు చేనేతకారుడు అని ఆయన పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా చేనేత వస్త్రాలు నిలిచిందని స్పీకర్ అన్నారు. ఆధునిక ఫ్యాషన్ మోజులోపడి చేనేత వస్త్రాలను విడిచిపెట్టామని, అదే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రపంచంలోనే పోటీదారుగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మార్కెటింగ్ వ్యూహాలు పరిగణలోకి తీసుకావాలని, సహకారాన్ని అందించుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దాన్ని అందిపుచ్చుకోవాలని స్పీకర్ కోరారు. నేతన్న నేస్తం కింద 24 వేల రూపాయలను చేనేతకారులు అందిస్తుందని ఆయన అన్నారు. పొందూరు పరిధిలో 290 మగ్గాలు ఉన్నాయని దాంతోపాటు దేవరవలస, అక్కులపేట, ఉప్పెన వలస, లావేరు తదితర ప్రాంతాలు చేనేత కార్మికులకు ప్రసిద్ధి చెందినవని అన్నారు. మినీ క్లస్టర్ స్థాయి నుండి మెగా క్లస్టర్ స్థాయికి ప్రయత్నం చేద్దామని ఆయన పేర్కొన్నారు. చేనేతకారులలో పేదరికం పోవాలని, జీవన ప్రమాణాలు పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం వస్త్రాలు బ్రాండ్ ఇమేజ్ గా మారాలని అందుకు అందరూ సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంద కోట్ల వరకు ప్రాజెక్టును ఏర్పాటు చేయుటకు జిల్లాలో అవకాశముందని అందుకు అన్ని చేనేత సంఘాలు సమైక్యంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఆరు వేల మంది చేనేతకారులు ఉన్నప్పటికీ మినీ పరిశ్రమ స్థాయిలో ఏర్పాటు చేయుటకు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించుటకు సిద్ధంగా ఉందని గుర్తించాలని చెప్పారు.
చేనేత జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు (రాజమండ్రి) బి .ధనుంజయ రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు అనేక పథకాలను ప్రవేశపెట్టి చేయూతను అందిస్తున్నాయన్నారు. ముద్రా రుణాలు, పొదుపు నిధి తదితర అంశాలను ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొందూరు ఖాదీ వస్త్రాలతో స్పీకర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు షేక్ అబ్దుల్ రషీద్, ఎంపీపీ కిల్లి ఉషారాణి, జడ్పిటిసి లోలుగు కాంతారావు, చేనేతకారులు పైడిలింగం, రమణ మూర్తి, నాగరాజు, స్థానిక సర్పంచ్ లక్ష్మి , జిల్లా బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్ తదితరులు పాల్గొన్నారు.