పింఛన్ దారులందరికీ కోవిడ్ వేక్సిన్..
Ens Balu
3
Vizianagaram
2021-10-30 12:35:11
నవంబరు 1వ తేదీన జిల్లాలోని పింఛన్ దారులందరికీ కోవిడ్ వేక్సినేషన్ పూర్తి చేయాలని, వేక్సిన్ వేసిన తరువాతే, వారికి పింఛన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. వలంటీర్ తోపాటుగా, ఎఎన్ఎం, ఆశా వర్కర్ కూడా పింఛన్ దారుల ఇళ్లకు వెళ్లి, ఇప్పటివరకు వేక్సిన్ వేయించుకోనివారికి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమం పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, 1వ తేదీకి అవసరమైన వేక్సిన్‌లను ముందుగానే సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. వేక్సిన్ వేసిన వెంటనే, వారి డేటాను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాని పింఛన్ దారులు, ఇతరుల వద్దకు వెళ్లి, నచ్చజెప్పి వారిని ఒప్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల సహాకారాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్క పించన్ దారుడూ వేక్సిన్ వేయించుకోకుండా ఉండకూడదని స్పష్టం చేశారు. పిహెచ్‌సిలు, క్లష్టర్లు, వలంటీర్ల వారీగా జరిగిన సర్వే నివేదికలను మరోసారి తనిఖీ చేయాలన్నారు. పరిశ్రమల్లో చాలాచోట్ల వేక్సినేషన్ పూర్తయినప్పటికీ, వారి డేటా ఆన్‌లైన్లో అప్లోడ్ కాలేదని అన్నారు. జిల్లాలో వేక్సినేషన్ శతశాతం పూర్తి చేసేందుకు ప్రతీ వైద్యాధికారీ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎల్.రామ్మోహన్ , డిఐఓ డాక్టర్ నారాయణ, వైద్యాధికారులు పాల్గొన్నారు.