ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని, అభివృద్ది దిశగా అడుగులు వేయాలని మహిళా సంఘాలకు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. తమపై తాము నమ్మకం ఉంచి, ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకొని, పెద్దపెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్థానిక టిటిడిసిలో శనివారం జరిగిన జిల్లా సమాఖ్య 206వ కార్యవర్గ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం మహిళా సంఘాలు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకొనేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆర్థికంగా ఎదుగుదలకు ఇదొక గొప్ప అవకాశామని పేర్కొన్నారు. సంఘాలు ముందుకు వస్తే, శిక్షణ, ఇతరత్రా సహకారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు, తెల్ల కార్డులకోసం ఆశపడకుండా, తామే ఆదాయపన్ను చెల్లించే స్థాయికి ఎదగాలని, పదిమందికి ఉపాధి కల్పించాలని కోరారు. చిన్నచిన్న యూనిట్లను కాకుండా, పెద్ద యూనిట్లను స్థాపించుకొనేలా సంఘాలు ముందుకు రావాలని, ఉన్నతంగా ఆలోచించాలని సూచించారు. సమావేశ భవనాలు లేని మండలాల్లో, కమ్యూనిటీ భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని వెళ్లడించారు. ఆంగ్లభాషపై పట్టు సంపాదించుకొనేందుకు మహిళలు ప్రయత్నించాలని కలెక్టర్ కోరారు.
జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ, స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూత, చేదోడు, తోడు, ఆసరా తదితర పథకాల డబ్బులు పెట్టుబడిగా పెట్టి, స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించాలని కోరారు. దీనికి అదనంగా స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ తదితర మార్గాల అదనపు రుణాలు తీసుకొని, యూనిట్లను స్థాపించుకొనే వెసులుబాటు ఉందని సూచించారు. మహిళలు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక సహకారాన్ని అందిస్తామన్నారు. కొత్త పరిశ్రమలతో పాటుగా, ఇప్పటికే నడుస్తున్న పరిశ్రమలకు కూడా పూర్తి సహకారాన్ని అందించడం ద్వారా, సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అధికారులకు జెసి సూచించారు. పలు అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ, తమ శాఖల పరిధిలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించారు.
ఈ సమావేశంలో డిఆర్‌డిఏ ఏపిడి కె.సావిత్రి, టిపిఎంయు ఏపిడి సత్యంనాయుడు, జిల్లా సమాఖ్య అధ్యక్షులు చింతపల్లి వెంకటలక్ష్మి, ఉపాధ్యక్షులు పీడిక రేవతి, కోశాధికారి బోడసింగి సన్యాసమ్మ, కార్యదర్శి కాగాన మేరీ, ఉప కార్యదర్శి సిరిశెట్టి సింహాచలం, వివిధ శాఖల అధికారులు, ఎఫ్ఎస్‌పిలు, ఏసిలు, ఎపిఎంలు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.