మూమెంట్, టూర్ డైరీలు నిర్వహించాల్సిందే..


Ens Balu
11
Visakhapatnam
2021-10-30 14:50:47

జీవిఎంసీ పరిధిలోని వార్డు సచివాలయ కార్యదర్శులు విధుల పట్ల బాధ్యతాయుతంగా పని చేయాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్. జి.లక్ష్మీశ ఆదేశించారు. శనివారము నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన  3వ జోన్ లోని 17, 18, 19 వార్డు పరిధిలోని జాలరి పేట నేతాజీ నగర్ ఆదర్శ నగర్ తదితర ప్రాంతాలలోని  6 సచివాలయాలను సందర్శించారు.  సచివాలయంలోని ప్రజలకు అందించే సేవలు,  సంక్షేమ పథకాల పోస్టర్లును పరిశీలించి,  సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు కొన్ని తెలుగులోనూ, కొన్ని ఆంగ్లంలోనూ ఉండడం గమనించి పోస్టర్లు ఇంగ్లీషు, తెలుగులో  అందరూ చదివే విధంగా  ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు.  కార్యదర్శుల యొక్క మూమెంట్ రిజిస్టర్, డైరీలను, బయోమెట్రిక్ ద్వారా హాజరును పరిశీలించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్యదర్శులు వారు నిర్వహిస్తున్న విధులు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వార్డు సచివాలయంలో ఉన్న కార్యదర్శులు  కూడా సంక్షేమ పధకాల యొక్క పూర్తి వివరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సచివాల్యాలలో వాడే ప్రతి రిజిస్టర్ ప్రభుత్వ రిజిస్టర్ కాబట్టి అందులో సంతకం పెట్టి,  సచివాలయం ముద్ర వేయాలని కార్యదర్శులకు సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందాలని ఉద్దేశంతో వార్డు సచివాలయ  వ్యవస్థను ప్రవేశపెట్టిందని,  ప్రజలు ఎన్నో ఆశలతో సంక్షేమ పథకాల కొరకు సచివాలయాలకు వస్తారని,  అర్హత ఉన్న ప్రతి పేదవానికి సంక్షేమ పథకం అందేలా చూడాలని కార్యదర్శిని ఆదేశించారు.  ప్రజలు పెట్టుకున్న అర్జీలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని లేని యెడల శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ పర్యటనలో కార్పొరేటర్లు గేదల లావణ్య, గొలగాని మంగవేణి, నోల్లి నూకరత్నం, జోనల్ కమిషనర్ శివప్రసాద్,  ఎఎంఒహెచ్ డాక్టరు రమణ మూర్తి, కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీనివాస్, ఎపీడి పద్మావతి సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.