ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్లు కిశోర్ కుమార్, మహేశ్ కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంకటప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేశ్ బాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. త్యాగధనుల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందని.. వారి స్ఫూర్తిని, భావజాలాన్ని భావితరాలకు అందజేయాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, మంచి పనితీరు, ఆదర్శ భావాలతో జీవిస్తూ ఆ గుర్తింపును కాపాడుకోవాలని పేర్కొన్నారు. మద్రాసీల నుంచి ప్రత్యేకంగా విడిపోక ముందో ఇక్కడి నాయకులు, ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, అవమానాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో ముందంజంలో ఉండాలని ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ ఫలితంగానే ఈ రోజు మనందరం ప్రత్యేక రాష్ట్రంలో జీవిస్తున్నామని, ఆయన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. గురజాడ చెప్పినట్లు పత్రి మనిషీ పౌరుల కోసం.. సమాజం కోసం జీవించాలని హితవు పలికారు. వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారానికి జిల్లా నుంచి అయిదుగురు ఎంపికవటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశాజనకంగా సాగిందని పేర్కొంటూ వైద్యాధికారులకు, సచివాలయ సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ విభాగ అధికారులు నిర్వహించిన జాబ్ మేళాలు సత్ఫలితాలను ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంకటప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీలు కిశోర్ కుమార్, మహేశ్ కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, డీఆర్వో గణపతిరావు, ఎస్‌డీసీ పద్మావతి, విజిలెన్స్ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఇతర జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.