పర్యావరణ హితంగా దీపావళి జరుపుకుందాం..
Ens Balu
5
Vizianagaram
2021-11-01 11:47:08
పర్యావరణానికి అనుకూలంగా దీపావళి పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి రోజు రాత్రి 8 గంటలు నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణాసంచా కాల్చాలని సూచించారు. దీపావళి పండుగ, బాణాసంచా విక్రయాలకు సంబంధించి, జాతీయ హరిత ట్రిబ్యునల్, మరియు కాలుష్య నియంత్రణ మండలి సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, వివిధ శాఖలకు కలెక్టర్ పలు ఆదేశాలను కలెక్టర్ జారీ చేశారు. ప్రకృతికి హితమైన, గ్రీన్ క్రాకర్స్ ని మాత్రమే వినియోగించాలని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్ పేర్కొన్నారు. దీపావళి రోజు రాత్రి 8 గంటలు నుంచి 10 గంటలు మధ్య మాత్రమే బాణాసంచా కాల్చాలని ఆదేశించారు. బాణాసంచా విక్రయించే షాపుల్లో అన్ని రకాల భద్రతా చర్యలను తీసుకోవాలని, తగిన జాగ్రత్తలను పాటించాలని, షాపులమధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలని సూచించారు. కొనుగోలుదారుల మధ్య కనీసం 6 అడుగుల భౌతిక దూరం ఉండేటట్టుగా, షాపులవద్ద క్యూ ఏర్పాటు చేయాలని, షాపులవద్ద శానిటైజర్లను వినియోగించవద్దని, దానికి బదులుగా చేతులను శుభ్రం చేసుకొనేందుకు సబ్బును వాడాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు, తగిన జాగ్రత్తలతో, పర్యావరణానికి విఘాతం కలుగకుండా, ప్రజలు దీపావళి పండుగను జరుపుకొనేలా ప్రజల్ని చైతన్యపరచాలని మున్సిపల్ కమిషనర్లను, తాశీల్దార్లు, ఎంపిడిఓలను కలెక్టర్ ఆదేశించారు.