గురుకులాల్లో సీఆర్టీల సర్వీసు పొడిగింపు..
Ens Balu
2
Kurupam
2021-11-02 07:25:35
రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయుల (సీఆర్టీలు) సర్వీసును 2021-22 విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో 1798 మంది కాంట్రాక్ట్ రిక్రూటెడ్ టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 794 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉండగా, 1004 మంది ఎస్జీటీలు, పీఇటీలు, లాంగ్వేజ్ పండిట్లు ఉన్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో వారి కాంట్రాక్ట్ సర్వీసును పొడిగిస్తుండగా ఈ ఏడాది కొన్ని సాంకేతిక కారణాలతో సీఆర్టీల సర్వీసు పొడిగింపును అధికారులు నిలిపివేసారు. దీంతో పలు పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లోనే సీఆర్టీలు తమ సమస్యను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఆర్టీల సమస్య గురించి ఉప ముఖ్యమంత్రి గత వారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సీఆర్టీల సర్వీసును పొడిగించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో సీఆర్టీల సర్వీసును ఈ విద్యా సంవత్సరానికి పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులను జారీ చేసారు. కాగా సీఆర్టీల సమస్యను గురించి తాను చెప్పిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కృతజ్ఞతలు తెలియజేశారు.