మన్యంలో "వెదురు కంజి" ఆ టేస్టే వేరబ్బా.!


Ens Balu
620
Lambasingi
2023-10-29 11:10:43

మన్యంలో వర్షాకాలం ప్రారంభమైందంటే ఆదివాసీలు సాంప్రదాయ ఆహారంగా ఎంతో ఇష్టంగా వెదురు కొమ్ములను తింటారు. ఈ కాలంలోనే అడవిలోని వెదురు మొక్కల వద్ద అధికంగా పిలకలు(లేత వెదురు) వస్తాయి. ఈ వెదురు పిలకలను సేకరించి ఆదివాసీలు కూర చేసుకుని తినడం ఆనవాయితీ. కూరగాయలు ఎన్నో రకాలు ఉంటా యి. కానీ మన్యంలో లభించే వెదురు నుంచి తీసిన చిగురు కూర రుచి వేరు అంటున్నారు గిరిజనులు. దీనిని వెదురు కొమ్ములు,వెదురు కంజి అని కూడా పిలుస్తారు. వెదురు కంజి కూర వాహ్వా.. అంటూ లొట్టలేసుకు తింటారు.  ఒక్కసారి ఈ కూర తిన్న వారు మరోసారి తినాల్సిందే. వెదురు కొమ్ముల కూర తాజాగా స్టార్ హోటళ్లలోనూ లభిస్తుంది. చైనా, వియత్నాం వంటి దేశాల్లోనూ ఎదురు కొమ్ములను కూరగా, స్నాక్స్ గా తీసుకుంటున్నారు. వెదురు కొమ్ములను ఆంగ్లంలో బేంబో సూట్స్ అని పిలుస్తా రు. ప్రస్తుతం చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్ లో ఆదివాసీలు వెదురు కొమ్ములను విక్రయిస్తున్నారు. అటవీ కొండ ప్రాంతాల్లో ఉన్న వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి చిగురును సేకరిస్తారు. 

దానిని శుభ్రపరిచి ముక్కలుగా చేస్తారు.  5 కొమ్ముల వాటా రూ.50 ల ధరకు విక్రయిస్తున్నారు. వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారీకి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఓరకంగా,ఎండబెట్టి మరో విధంగా కూర తయారీకి వినియోగిస్తారు. పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కూర తయారు చేసుకోవాలి. ఎండబెడితే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర వండుకోవచ్చు. వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకాలుగా కూరలను తయారు చేసుకొని చాలా ఇష్టంగా తింటారు ఆదివాసీలు. ఈ కొమ్ములు కొనుగోలు చేసేందుకు భోజన ప్రియులు పోటీపడుతున్నారు. ముఖ్యంగా కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు వెదురు కంజిని బాగా కడగాలి. అప్పుడే వెదురు కంజిలో ఉండే చేదు పోతుంది. వెదురు కంజిని బాగా ఉడకబెట్టి దాని కషాయాన్ని తాగితే శరీరానికి మంచి చలువ చేస్తుందని గిరిజనులు చెబుతున్నారు. మధుమేహం,కపం,మూల వ్యాధి నివారణకు ఆయుర్వేద పరంగా ఎంతో ఉపశమనం ఇస్తుంది. కడుపులో నులిపురుగులను తొలగిస్తుందని దీనిని చిన్నపిల్లలకు కూడా తినిపిస్తారు. గాయం మానేందుకు వెదురు కంజిని పేస్టుగా చేసి గాయాలపై రాస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని కూడా చెబుతున్నారు. మారుమూల గిరిజనులు పాము,తేలు కాటుకు ఔషధంగా సైతం దీనిని వినియోగిస్తున్నారు. 

అధిక పోషక విలువలు.. వెదురు కొమ్ములు అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారం. ఉడికించిన వెదురు కొమ్ములలో 15.5 గ్రాముల నుంచి 64 గ్రాముల క్యాలరీ లు,శక్తి 2.5 గ్రాములు, ప్రొటీన్ 4.5 గ్రాములు,ఫ్యాట్ 2 గ్రాములు,ఫైబర్ విటమిన్ బి6 14 శాతం, ఈ 9 శాతం, కె 3 శాతం, రిబో ప్లేమిన్ 3 శాతం, థైమిస్ 3 శాతం, పాస్ప రస్ 3 శాతం,పొటాషియం 3 శాతం, ఐరన్ 3 శాతం లభిస్తుంది. పౌష్ఠికాహార లోపం, రక్తహీనత కలిగిన వారితో పాటు గర్భిణులు,బాలింతలకు ఇది మంచి ఆహారమని చెబుతారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణిలకు దీని కూరను, పులుసు, తాజాగా ఇపుడు లైట్ గా ఉడకబెట్టి మసాలా వేసి మరీ స్నాక్స్ గా ఇస్తున్నారు. దీని టేస్ట్ ఫ్రెంఛ ఫ్రైస్ కి వంద రెట్టు అధికంగా వుంటుంది. ప్రస్తుతం మన్యంలోని టూరిజం ప్రాంతాల్లోని వెదురుకంజితో తయారు చేసిన రక రకాల ఆహార ఉత్పత్తులను అందుబాటులో కూడా ఉంచుతున్నారు. వెదురుకంజి కూర దాని పోషక విలువల కోసం తెలుసుకున్నారు. ఇక మీరూ ఓసారి ట్రైచేసి చూడండి. దాని టేస్ట్ ఎలా ఉందో ఆశ్వాదించండి. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.