దూల తీరిపోయే మేటర్.. పుస్తులు తాకట్టు.. స్థానిక దిన పత్రికల ముద్రణకు తొలిమెట్టు..!


Ens Balu
8
visakhapatnam
2025-07-12 07:24:20

పుస్తులు అమ్మైనా పులస చేప తినాలనే సామెత నిజమో కాదో తెలీదు గానీ.. పుస్తులు అమ్మకపోతే నేటి రోజుల్లో స్థానిక దినపత్రికలు మనుడగ మాత్రం సాధ్యపడటం లేదు. కనీసం ముద్రణకి నోచుకోవడం లేదు. వందలకోట్లు పెట్టి పత్రికలమీద పెట్టిన యాజమాన్యాలకి వేల కోట్లు ఆదాయం వస్తే.. వాళ్లు పత్రికలు నడపడం గొప్పకాదు. ఆదాయం లేకపోయినా.. సామాజిక బాధ్యతతో నిర్వహించే స్థానిక పత్రికల నిర్వహణ ఒక్కసారి చేస్తే దాని కష్టం బాధలు ఎలా ఉంటాయో కళ్లకి కట్టినట్టు తెలుస్తాయి. మీరు చదువుతున్నది నిజమే. నేటి రోజుల్లో స్థానిక దినపత్రికల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ఒక స్థానిక దినపత్రిక సర్వాంగ సుందరంగా తయారై.. ప్రింటింగ్ అయితే నెలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అక్షరాలా రూ. 2.50లక్షలు. వినడానికి, నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్న ఇది అక్షర సత్యం. ఆ మొత్తం ఎలా అవుతుందో ఒక్కసారి లెక్కలు చూద్దాం.. 

పత్రిక కార్యాలయం లేదా ఇంటి అద్దె కనీసం రూ. 8500, ఇంటర్నెట్ నెలకి రూ.1800, కరెంటు బిల్లు రూ.1500, సబ్ ఎడిటర్ జీతం రూ.18000, డిటిపి ఆపరేటర్ జీతం రూ. 15000, పేపర్ బాయ్ జీతం రూ. 9000, పత్రిక ప్రింటింగ్ రూ.180000, చార్టెడ్ అకౌంటెంట్ చార్జ్ నెలకి(జిఎస్టీకి) రూ. 850, ఈ-పేపర్ వెబ్ సైట్ నిర్వహణ(అదీ ఉంటే) రూ. 1800, న్యూస్ వెబ్ సైట్ నిర్వహణ రూ.1800, న్యూస్ యాప్ నిర్వహణ రూ. 1800, వీటితోపాటు గుగూల్ ప్లేస్టోర్ చార్జెస్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ వెబ్ సైట్, యాప్, ఈపేపర్ అందరూ నిర్వహించాలని ఏమీ లేదు. కొందరు ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు మానేస్తున్నారు. అవిమానేసినంత మాత్రనా మహా అయితే ఒక ఐదువేల రూపాయలు తగ్గుతుందేమో కానీ మిగిలిన ఖర్చులన్నీ తప్పకుండా పెట్టుబడి పెట్టి తీరాల్సిందే. ఇవి కాకుండా ఏడాదికి ఒకసారి వేసే ఈఫైలింగ్, కార్యాలయ స్టేషనరీ ఖర్చులు, కార్యాలయ ఖర్చుల మళ్లీ అదనం. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వానికి, సమాచార పౌర సంబంధాల శాఖకు స్థానిక దినపత్రికలంటే చులకనే. ఎన్ని నిబంధనలు పెడితే అంత త్వరగా స్థానిక పత్రికలను కనీసం ప్రెస్ అక్రిడిటేషన్లు కూడా ఇవ్వకుండా అణగదొక్కేయవచ్చు. 

ప్రభుత్వ ప్రకటనలు రాకుండా, ఎంపానల్ మెంట్ చేయకుండా వదిలేయవచ్చునని చూస్తాయి. ఇదేదో కావాలని అంటున్న మాటలు కాదు. ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్న తీరు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏది వచ్చినా మీడియా నియంత్రణ.. అందునా స్థానిక పత్రికల మనుగడను ప్రశ్నార్ధకం చేయడమే తొలి కర్తవ్యంగా భావించి మరీ పనిచేస్తున్నాయి. మళ్లీ అదే ప్రభుత్వాలకి ఉచితంగా ప్రచారాలు చేయాలి. ఆహా ఓహో అని పొగడాలి. నిత్యం వారి కోసమే రాయాలి. కానీ వారి నుంచి కనీసం ప్రభుత్వ ప్రకటనలు కూడా రాని పరిస్థితి. ఒక ఎంపానల్ మెంట్ అయిన స్థానిక దినపత్రికకు ప్రభుత్వం యాడ్ ఇస్తే రూ. 10 ఇస్తుంది. అదే పెద్ద పత్రికలుగా ఎడిషన్లు ఉన్న పేపర్ కి మాత్రం రూ. 1లక్ష వరకూ ఇస్తుంది. అలాంటి ప్రభుత్వ ప్రకటనలు ఏడాదిలో ఎన్ని ఇస్తే చిన్నపత్రికలు అభివృద్ధిచెందుతాయి..? పెద్ద పత్రికలు అభివృద్ధి చెందుతాయో ప్రభుత్వం గానీ, సమాచార పౌర సంంధాలశాఖ అధికారులు గానీ ఆలోచించాల్సి వుంది..?  అన్నీ మేమే చేస్తున్నట్టు చిన్న, స్థానిక దిన పత్రికలు వాళ్లు ఫీలై పోతున్నారని అని అంటారా..? మీరేమీ చేయరు ప్రభుత్వ నిబంధనలే అమలు చేస్తారని.. 

ఆ సమయంలోనే స్థానిక పత్రికలను ప్రక్కన పెట్టేస్థారని అనాల్సి వస్తున్నది..! ఉదాహరణకు తీసుకుంటే గత ప్రభుత్వంలో జీఓ నెంబరు-38 తీసుకు రావడంతో స్థానిక పత్రికలు చాలా వరకూ తుడిచిపెట్టుకు పోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియాకి మాత్రం వందల కోట్లు ప్రకటనల ద్వారా ఆర్జించి పెట్టారు. అందులో కనీసం దశమభాగం స్థానిక పత్రికలు ప్రకటనలు విడుదల చేసినా చాలా పత్రికలు, వాటిపై ఆధారపడి బ్రతికేవారికి కాస్త ఉపాది లభించేది. కానీ గత ప్రభుత్వం అలా ఆలోచించడంలేదు. స్థానిక పత్రికలు, చిన్న, మధ్య తరహా పత్రికలను సమూలంగా కూకటి వేళ్లతో పెకిలించేయాలనే నిర్ణయించుకున్నది. అలాంటి సందర్భంలో స్థానిక పత్రికలకు ప్రకటనలు లేకపోతే పరిస్థితి ఏంటి..? తప్పని సరి పరిస్థితుల్లో పుస్తెలు అమ్ముకోక తప్పని పరిస్థితి. లేదంటే డబ్బు రాదు.. డబ్బులేకపోతే పత్రిక నిర్వహణ సాధ్యం కాదు..! మధ్య మధ్యలో వచ్చిన చిన్నా చితకా ప్రకటనలు కంటితుడుపుగా మాత్రమే పనిచేస్తున్నాయి.

 కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మాత్రం స్థానిక దినపత్రికలకు జీవం వచ్చింది. ఎంపానల్ మెంట్ దినపత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేస్తున్నారు. తద్వారా కొద్దిమేర  పత్రికల నిర్వహణ ఆర్ధిక భారం తగ్గుతోంది. మరి ఎంపానల్ మెంట్ లేని వారి పరిస్థితి ఏంటంటే  పీకల్లోతు వరకూ చేసిన అప్పులే కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కొందరు అధికారులు, రాజకీయపార్టీల నేతలు, పత్రికలను ప్రోత్సహించేవారు ఇచ్చే చేయూత ప్రకటనలే స్థానిక పత్రికలకు జీవనాధారం. లేదంటే మళ్లీ అప్పులు చేసి పత్రిక నిర్వహణ చేయాల్సిందే. ఇన్ని చేస్తున్నా.. నేటికీ స్థానిక, చిన్న పత్రికలంటే సమాచారశాఖ అధికారులు.. సిబ్బందికీ అంటరాని తనమే అధికారులకి. ప్రధాన పత్రికలంటే మెరుగ్గా వార్తలు వచ్చి. నేషనల్ న్యూస్ పేపర్ ఫార్మాట్ లో పత్రికలు నిర్వహిస్తున్నా కనీసం దానిని గుర్తించే అవగాహన కూడా చాలా మంది సమాచారశాఖ అధికారులగానీ, ఇతర అధికారులు, మరికొందరు మా పార్టీకీ పేపర్, ఛానల్ ఉందని బీరాలు పోయేవారికి అర్ధం కావడం లేదు. ఇక జన్మలో అర్ధం కాదు కూడా..?!