మీడియాకి కులం పిచ్చి పట్టుకుంది..కులం మోజులో జర్నలిజం పతనమైపోతున్నది. వాడు మన కులపోడైతే చాలు.. వాడినే ఆదరించండి.. వాడినే చేరదీయండి.. మన కులపోడు కాకపోతే మనమేం చేసుకుంటాం..అనే దోరణి వచ్చేసింది. కులం జర్నలిజాన్ని నిలబెడుతుందా..? బ్రతికిస్తుందా..? తెగించి పనిచేసేలా చేస్తుందా..? వాస్తవాలు బయటకు తీస్తుందా..? అసలు కుల మీడియా ఏం చేస్తుందంటే.. రాజకీయపార్టీలకు, కుల పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తుంది. అసలు జర్నలిజం కాకుండా కులమిజం చేస్తుంది. ఒకప్పుడు బాగా వార్తలు రాస్తే మంచి జర్నలిస్టు అనేవారు. ఇపుడా పదం చచ్చిపోయి ఎర్నలిస్టు అంటున్నారు. నేడు జర్నలిస్టుగా ఏదైనా మీడియాలో చేరాలంటే అయితే కులం ఉండాలి.. లేదా సంస్థ పెద్దలకు చక్కభజనలు చేయడం రావాలి.. ఆ మూడో పదం ఇక్కడ రాస్తే అంతగా బాగోదని రాయడంలేదు గానీ ఆ పనులు చేసేవారూ లేకపోలేదు. సోషల్ మీడియా జెడ్ స్పీడ్ లో పెరిగిపోతున్న వేళ అసలైన మీడియా కాస్త మసక బారిపోయి అంతా కాపీ పేస్టు జర్నలిజం వచ్చేసింది.
కనీసం ఇంటర్ కూడా పాస్ కాని వ్యక్తి ప్రధాన మీడియా సంస్థలు, టీవీ ఛానల్స్ లో స్టాఫ్ రిపోర్టర్లు, బ్యూరోలు, రీజనల్ కో-ఆర్డినేటర్లుగా చలామణీ అయిపోతున్నారు. అయితే కులబలం ఉండాలి.. లేదంటే బ్లాక్ మెయిలింగ్ పక్కాగా చేయడం వచ్చైనా ఉండాలి. ప్రస్తుతం ఈరెండు ప్రధాన అర్హతలుగా మాత్రమే మీడియా పనిచేస్తుందంటే అతిశయోక్తి కాదేమో. విశేషం ఏంటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం పెద్దల కులమైత సదరు మీడియాకి రాజభోగం. అందులో పనిచేస్తున్నవారికి మహా విలాసం. కులాభిమానం చాటుకోవడానికి మిగిలిన చిన్నా చితకా మీడియా సంస్థలను తొక్కేసి మరీ వాళ్ల కులపోళ్ల మీడియా సంస్థలను పెంచి పోషించేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కుల మీడియాలో విద్యార్హతలు, జర్నలిజం శిక్షణలు, బాగా పనిచేయడం వంటి వాటితో పనిలేదు. సంస్థకి ఎంతిస్తావ్.. మాకెంతిస్తావ్.. అప్పుడప్పుడూ మాకేం చేస్తావ్.. వంటి అంశాలు మాత్రమే నడుస్తున్నాయి. అధికారంలోని ప్రభుత్వ పెద్దలు కూడా కుల మీడియాకి ఇచ్చిన విలువ వాస్తవ మీడియా, బ్యాలెన్స్ డ్ మీడియా కి ఇవ్వడం లేదు.
అధిష్టానం నుంచి ఆదేశాలున్నాయి.. మా కులపోళ్ల మీడియాకే యాడ్స్ ఇవ్వమన్నారు.. ప్యాకేజీలు అప్పగించమన్నారు. పనులు చేసిపెట్టమన్నారు. మీడియా సంస్థలు ఉంటే చాలు ప్రభుత్వ స్థలం రాసివ్వమన్నారు అంటూ కుల మీడియా అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు నేటి ప్రజా ప్రతినిధులు. అంటే ఇక్కడ వారి రాజకీయ జీవితం కూడా నడవాలి కదా. అలా నడవాలంటే వాళ్ల కులపోళ్ల మీడియాని మాత్రమే ప్రభుత్వం ముందు హీరోని చేసి.. మిగిలిన మీడియాలను మొత్తం జీరోలను చేయాలి. అలా చేయకపోతే వారికి మనుగడ ఉండదు. అడపా దడపా.. మీరు చదువుతున్నటు వంటి వార్తలు ప్రచురితం అయినపుడు మాత్రం నిజంగా ఆలోచించే వ్యక్తులుగా మాత్రం ఈ మాట కూడా నిజమే. కానీ మనం ఏమీ చేయలేం. మనకులపోళ్లను కాదని ఎవరికీ ఏం చేయలేని పరిస్థితి. ఇలాంటి కథనాలు, కథానికలు ఎన్ని వచ్చినా, మరెన్ని ప్రచురితం అయినా చూసి చదవుకొని ఓహో అనుకోవడం తప్పితే మరేమీ చేయలేని పరిస్థితి అంతే అంతకు మించి ఆలోచిస్తే మన కులపోళ్ల దగ్గర మాటొచ్చేస్తుందంటూ కుల మీడియా బాగోగులను ఎంచక్కా చూసుకుంటున్నారు.
ఇదంతా ఇపుడే వచ్చిందా అంటే అదేం కాదు. మీడియా ప్రారంభం అయిన రోజుల నుంచి కాకపోతే సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తరువాత ప్రజలను ఆలోచింప చేస్తున్నది కులాభిమానం చూపించుకుంటున్నది మాత్రం ఇపుడే. రాను రాను ఆ కులాభిమానమే మోతాదు పెరుగుతంది తప్పితే తరగడం లేదు. ఈ క్రమంలో అసలైన జర్నలిజానికి చదలు పట్టి ఎర్నలిజంగా మారిపోయి కులపిజం అయిపోతున్నది. ఒకరంగా నిజమైన జర్నలిస్టుకి ఈ విషయం చాలా బాధ కలిగించవచ్చు. కానీ ఏమీ చేసే పరిస్థితి లేదు. రాదు.. వాళ్ల కులపోళ్లు రానీయరు కూడా. అధికార పక్షంలో మరో కులపోళ్లు రాజ్యమేలుతున్నప్పుడు చూసి బాధపడే ఇటువైపు కులపోళ్లు.. వీళ్ల కులపోళ్లు అధికారంలోకి వచ్చినపుడు వీరు భూమికి నాలుగు అంగుళాల ఎత్తులోనే నడుస్తారంటే అతిశకయోక్తి కాదు. ప్రభుత్వ ప్రకటనలు వారికే వస్తాయి.. బయట ప్రకటనలూ వారికే వస్తాయి. వాళ్ల కులపోళ్ల ప్రకటనలు వారికే వస్తాయ్..
ఇలా అన్నీ వాళ్ల కులపోళ్లను పెంచి పోషించి చిన్న మీడియా సంస్థలను అనతి కాలంలోనే వేల కోట్ల మీడియా సంస్థలుగా మార్చేయడానికి కులపిజం ఇచ్చినంత చేయూత మరేదీ ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో స్థానిక పత్రికలు, విలువలకు కట్టుబడే పత్రికలు అన్నీ మట్టికొట్టుకుపోవడమే అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇదంతా గతంలో ఎవరికీ తెలియకే మీరు చెబుతున్నారా అంటే.. తెలుసు.. కానీ అప్పుడప్పుడైనా తెలియజేస్తుంటే ఏ కులపోడైనా ఎర్నలిజానికి, కులపిజానికి కాకుండా జర్నలిజానికి గౌరవం ఇస్తారనే చిన్న ఆశమాత్రమే అనుకోవాల్సి వస్తుంది. జర్నలిజం మసకబారుతున్నది.. కులపిజం అభివృద్ధి దిశగా పయనిస్తున్నది..చివరిగా ఒక్కమాట చెప్పకపోతే మనసు ఊరుకోదు.. ఈ కులపిజంపై కథనం రాసిన వాడూ మా కులపోడే మరి అది మనం తెలుసుకోవాలి..?!