ప్రధాని మోడీ సారూ మీరు ప్రతీ ఏటా రావాలి. విశాఖ మహానగరం సుందరమైన నగరం అంటే సరైన అర్ధం మీరొస్తేనే కనిస్తున్నది. మహా విశాఖ నగరం మునుపెన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా మెరిసి మురిసింది. మీరు వస్తున్నారని రోడ్డుపై చెత్త లేకుండా చేశారు. మీరు వస్తున్నారని రోడ్లపై గుంతలు పూడ్చారు.. మీరు వస్తున్నారని చెట్టుకొమ్మలు నరికారు.. మీరు వస్తున్నారని వీధి లైట్లు వెలిగించారు.. మీరొచ్చారనే క్లీన్ విశాఖ అంటే ఎలా ఉంటుంతో విశాఖ వాసులకు చూపించారు. ఇది కదా విశాఖ వాసులకు యోగం అంటే. మీరు ఇచ్చిన యోగా సందేశం యోగా ఎంతమంది పాటించి చేస్తారో తెలీదు గానీ. మీ రాక మాత్రం మహావిశాఖ నగర వాసులకు సరికొత్త విశాఖను చూపించింది. ఇదేదో కాలమ్ నింపడానికి రాస్తున్న అంశం కాదు. విశాఖ వాసులు నిజంగా మీరు వస్తున్న విషయం విశాఖవాసులకు కొట్టొచ్చినట్టు కనిపించింది.
నాలుగు రోజుల పాటు పీఎం యోగా ట్రైల్ రన్ పేరిట రోడ్లు బ్లాక్ చేశారు. యోగాంధ్రను విజయవంతం చేయాలని ప్రభుత్వ అధికారులు, క్రిందిస్థాయి సిబ్బందిని నిద్రాహారాలు లేకుండా కూడా చేశారు. ఇదంతా మీ పుణ్యమే మోడీసారూ. విశాఖ వేదికగా యోగాంధ్ర 2025 జరుగుతున్నందుకు విశాఖ వాసులకు ఒక రకంగా ఆనందం మరో రకంగా నరకం కనిపించాయి.కానీ బాధ మిగల్లేదు కానీ కొద్ది పాటి అభివ్రుద్ధి మాత్రం మీరొస్తున్నందుకు కనిపించింది. మీరు వచ్చినందుకే టైట్లఉ వేసిన వారికి, వీడియోలు తీసిన వారికి, మొక్కలు అమ్మిన వారికి, షామియానాలకు, వాహనాలకు బేరం కూడా వచ్చింది. కొందరు కాంట్రాక్టర్లు వారం రోజుల్లో లక్షాధికారులు అయ్యారంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు. మీరొస్తున్నారని బాగా ప్రచారం చేసిన బడా పత్రికలకు, తమ అనుకున్న సోషల్ మీడియాకి లక్షల్లో ప్రకటనలు వస్తే చిన్న, స్థానిక పత్రికలకు ప్రకటనలు కూడా వచ్చాయి అదీకూడా ఎంపానల్ మెంట్ ఉంటే. లేనివారికి వచ్యాయి కష్టపడి వార్తలు రాసినందుకు, ప్రచారం చేసినందుకు జాడు నీరసాలు.
పొగుడుతున్నామని కాదు గానీ ప్రపంచం మొత్తం ఈరోజు విశాఖ వైపు చూస్తుందంటే దానికి కారణం మీరే.మీరొస్తున్నారనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా విశాఖ వచ్యాయి. మీరు రావడానికి గంట ముందే విశాఖలో ఒక రికార్డు నమోదైతే..విజయవాడలో మరో రికార్డు నమోదైంది. అసలు మీరున్న చోట రికార్డులు ఎప్పుడూ నమోదు అవుతూనే ఉంటాయి. రికార్డులు కాగితంపై రాసుకోవడానికి పనిచేస్తే.. మీరొచ్చినందుకు మాత్రం ప్రత్యకంగా వందల మందికి మేలు జరిగితే పరోక్షంగా వేల మందికి మేలు జరిగింది. ఈ విధంగా తరచూ జరిగితే చాలా మంది బ్రతుకులు బాగు పడతాయి. విశాఖవాసులకు ప్రధాన సమస్యలు కూడా తీరిపోతాయి. అందుకే మిమ్మల్ని ప్రతీ ఏటా వస్తారా అని ఆహ్వానిస్తున్నాం. మరి ప్రభుత్వం అంటే ప్రజల కోసమే కదా ఉండేది.. ప్రజలనే కదా పాలించేంది. ప్రభుత్వాల కోసం ఓట్లేసిన ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే మీరు ప్రతీఏటా రావాలి కదా.. ఒక్కసారి వస్తేనే ఇంత జరిగిందంటే ప్రతీ ఏటా వస్తే మరెంత మేలు ఇంకెంతమందికి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి మీరు.
విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీ.. కానీ అలాంటి సుందరమైన నగరం మురిసిపోవడం, మెరిసిపోవడం చాలా అరుదు. కానీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పుణ్యమాని మీరు విశాఖ వస్తున్నందుకు మాత్రం మహ బాగా విశాఖ మెరిసి మురిసిందంటే అంతకంటే ఏం కావాలి. ఇంకేం కావాలి. మీరు వస్తున్నారనే ప్రజాప్రతినిధులు కూడా ప్రజల వద్దకే వెళ్లి యోగా కోసం ప్రచారం కూడా చేశారు. ఈనెలరోజులు యోగా పుణ్యమాని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రం యోగా వారి జీవితంలో భాగం అయిపోయింది. విశాఖకోసం ఒక్కసారి ఆలోచించండి.మీరొస్తున్నందుకు మెరిసి మురిసిన విశాఖను నగరవాసులకు బహుమతి ఇవ్వండి.. వస్తారు కదూ..!