కొమ్మినేని విషయంలో వర్కింగ్ జర్నలిస్టుల స్పందన కరువైంది అందుకేనా..!


Ens Balu
855
visakhapatnam
2025-06-11 22:22:41

 ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు విషయంలో స్పందించకపోవడంపై అనేక కారణాలున్నాయి. టీవి ఛానల్ లో డిబేట్ లు పెట్టినపుడు రాజధాని భూముల విషయంలో మహిళలను వేశ్యలతో పోల్చడం అనే పదం అత్యంత దారుణం. అలాంటి పద ప్రయోగం జర్నలిస్టు కొమ్మినేనే కాదు మరెవరు ఉపయోగించినా నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు దూరంగానే ఉంటారు. అందులోనూ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి చేపట్టిన ఆయన ఇలాంటి పద ప్రయోగం టీవీ ఛానల్ లో చేయడం అనేది ఇపుడు సామాజిక మాద్యమాల్లో కూడా వైరల్ అవుతున్నది. సాక్షి మీడియాపై దాడిని ఖండిస్తున్న జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు కొమ్మినేని విషయంలో మాత్రం ఎవరూ నోరు మెదపడం లేదు. కారణం జర్నలిజం విలువలు టివి ఛానల్ ఉంటేనో, పత్రికలు నడిపితేనో అన్నీ మనం చెప్పినట్టే జరుగుతాయనుకోవడం అవివేకం అవుతాయని.. అలాంటి సందర్భంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందనడానికి కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు, ఆయన  అరెస్టులే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

  టీవి ఛానల్ లో డిబేట్ లు అంటే ఆరోగ్య కరంగానూ, ప్రభుత్వాలను, పాలక పక్షాలను, ప్రతిపక్షాలను, అన్నివార్గాల ప్రజలను ఆలోచింపజేసేవి ఉండాలి తప్పితే ఏం చెప్పినా.. ఏం మాట్లాడినా జనం చూస్తుంటారని.. మహిళలు ఏం మాట్లాడరు అనుకుంటే తప్పులో కాలేసినట్టు అవుతుందని నేడు నిరూపణ అయ్యింది. అంతేకాదు కొమ్మినేని అరెస్టు అయిన తరువాత జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలు స్పందించకపోవడానికి కారణం కూడా లేకపోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మీడియాని, అందున స్థానిక, చిన్న పత్రికలను చాలా చులకన చూశారు.. దానితో స్థానిక పత్రికల మనుగడ ప్రశ్నార్ధకం అయ్యింది.  ప్రెస్ అక్రిడిటేషన్ గుర్తింపునకు కూడా స్థానిక, చిన్న, మధ్య తరహా పత్రికలు నోచుకోకుండా జీఓనెంబరు-38 ని తెరమీదకు తీసుకువచ్చి చిన్న పత్రికలు వాటంతట అవే మూసుకునేలా కూడా చేశారు. ఒక వర్గం మీడియాకి ఇచ్చిన ప్రభుత్వ ప్రకనల్లో ఒకటవ వంతు కూడా ఇవ్వలేదు. ఆ సమయంలో కూడా ప్రభుత్వ సలహాదారులు, ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్న చిన్నపత్రికల కోసం, ఏక పక్షంగా ఇస్తున్న మీడియా ప్రకటనల కోసం ఒక్క మాట కూడా మట్లాడలేదు. 

ప్రభుత్వంలో ఒక సంస్థకు చైర్మన్ గా ఉంటే ఒక్క అధికార పార్టీ మీడియానే కాదు. అన్ని మీడియా సంస్థలను ఒకేలా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ సమయంలో అలా చూడని వ్యవహారాన్ని కూడా జర్నలిస్టులు గుర్తుపెట్టుకున్నారనే విషయం కొమ్మినేని అరెస్టు విషయంలో రుజువైంది. ఎక్కడో సదరు  రాజకీయపార్టీకి అనుకూలంగా ఉన్న జర్నలిస్టు సంఘాలు, కొందరు జర్నలిస్టులు ఆ రాజకీయపార్టీకి చెందిన వారి హడావిడి తప్పితే ఇతర ప్రధాన జర్నలిస్టు సంఘాల నుంచి కొమ్మినేని, మరో జర్నలిస్టు క్రిష్ణం రాజు అరెస్టులపై ఖండనలుగానీ, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు కూడా జరగలేదంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సి ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి ఒక వర్గం మీడియా వత్తాసు పలకడం రివాజు.. కానీ.. మీడియా వ్యతిరేక అంశాలు చేపట్టినపుడు యావత్ మీడియా నుంచి స్పందన గట్టిగానే ఉంటుంది. అలాగని చేతిలో టివి, పత్రికలు ఉన్నాయని అన్ పార్లమెంటరీ పదాలు వినియోగిస్తే చట్టం ఎవరి చుట్టం కాదని కూడా కొమ్మినేని అరెస్టు విషయంలో నిరూపణ అయ్యింది. వాస్తవానికి రాజకీయ కోణంలో ఈ అరెస్టులు ఉన్నాయని జర్నలిస్టులు ఎవరూ భావించడంలేదని కూడా తేలిపోయింది. 

లేదంటే ఈపాటికే రాష్ట్రం మొత్తం జర్నలిస్టు సంఘాల ఆందోళనలతో అట్టుడికిపోయేది. అందులోనూ ఎప్పుడు మీడియాపై దాడులు జరిగినా.. జర్నలిస్టులకు ఆపద వచ్చిన ముందుండేవి చిన్న, స్థానిక పత్రికలే. కానీ సదరు జర్నలిస్టు విషయంలోనూ, సదరు మీడియా విషయంలో ఎవరూ ఆందోళన చేపట్టడానికి ముందుకి రాలేదు. వస్తే గిస్తే.. వారి పార్టీ ప్రతినిధులు తప్పా. నిజంగా ఏ ప్రభుత్వమైనా చిన్న, మధ్యతరహా స్థానిక పత్రికలకు చేయూత అందిస్తే ఎంతో కొంత అభిమానం జర్నలిస్టులు చూపిస్తారు. పెద్ద పత్రికలు, మీడియా చేస్తున్నది కూడా అదే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సమాజిక వర్గానికి చెందిన పత్రికలు, టీవీలు, ఆఖరికి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను కూడా ప్రత్యేకంగా పెంచి పోషించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇదే ఇపుడు విభజించు పాలించు సిద్దాంతానికి దగ్గర అవుతున్నది. ఒకప్పుడు భయపడే చిన్న, స్థానిక పత్రికలు కూడా నేడు తెగించి వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. జర్నలిస్టులకు మేలు చేసే సంస్థలకు, ప్రభుత్వాలకు మీడియా సంస్థలకు కూడా సహకారం అందిస్తున్నాయి.

 అసలు చిన్న, స్థానిక పత్రికలు మీడియానే కాదని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా గత ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు, దానిని ఒక ఉన్నత స్థానంలో ఉండి కూడా ప్రశ్నించని తీరు నేడు ఆయనకే కష్టం వచ్చినపుడు వర్కింగ్ జర్నలిస్టులు కూడా కనీసం స్పందించకపోవడాన్ని కూడా సదరు రాజకీయపార్టీ, టీవి, పత్రిక కూడా చాలా దగ్గర చూస్తున్నా ఏమీ చేయలేకపోతున్నాయి. ఎప్పుడూ నాణెం ఒకవైపే కనిపిస్తుందనుకోవడం పొరపాటని.. దానికి రెండో వైపు కూడా మరో రూపం వుంటుందనే విషయాన్ని నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టు కొమ్మినేని విషయంలో స్పందించకుండా ఉన్నతీరు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి. ఏది ఏమైనా డిబేట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు చేయడం చాలా పెద్ద పొరపాటని మాత్రం కొమ్మినేని అరెస్టుతో మిగిలిన టివి ఛానళ్లు, ఇతర పత్రికలకు బాగా తెలిసొచ్చింది. 

ఇలాంటి అరెస్టులు జరగకపోతే పరిస్థితి ఇంకెంత ముందుకు వెళ్లి.. మరెలాంటి పద ప్రయోగం చేస్తారో ఈ టీవీ, మీడియా వాళ్లనే చర్చ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగిందంటే ఈ సంఘటన ఎంత వరకూ దారితీసిందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు. ఇదేదో ఒక్క కొమ్మినేని శ్రీనివాసరావు, క్రిష్ణం రాజులమీద ఏదో బురద చల్లాలని మాత్రం కాదు సుమీ. ప్రస్తుత పరిస్థితి, గత ప్రభుత్వంలో మీడియా విషయంలో వ్యవహరించిన తీరును గుర్తుపెట్టుకున్న జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాల వ్యవహారా శైలిని మాత్రమే ఇక్కడ ఉటంకించాల్సి వస్తున్నది.  'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' అని మన సంస్కృతి చెబుతుంది. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అని దీని అర్థం. స్త్రీ స్వభావమే ఆదిమాతృత్వం. కుటుంబాన్ని కాపాడే బలం, సమాజంలో వెలుగులు నింపే శక్తి, భవిష్యత్ పల్లవించే ప్రేమ స్త్రీల గొప్పతనం. అలాంటి స్త్రీలను కించపరిచినట్టుగా మాట్లాడితే మిగిలిన మహిళా లోకం ఊరుకోదు. అది ఎవరికీ క్షేమ కరం కూడా కాదు..!