ప్రకృతి సుందర అందాల అల్లూరి మన్యం మధుర ఫలాల సాగుకు అనుకూలంగా మారింది. ఇక్కడి శీతల వాతావరణం, నేలలు ఆదాయాన్ని సమకూర్చే పండ్ల ఫలసాయా లకు కలిసొస్తున్నాయి. ఇప్పటికే హిమాలయాల్లో పండే యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల పంటలతో ఈ ప్రాంతం విజయవంతంగా సాగవుతుంది. ఇప్పుడు నోరూరించే స్ట్రాబెరీ సాగు గిరి రైతులకు సిరుల పంట పండిస్తుంది. అమెరికాలో పుట్టిన స్టాబెరి ఆంధ్ర-కాశ్మీర్ గా పేరుగాంచిన లంబసింగిలో సిరులు కురిపిస్తుంది. ఈ స్టాబెరిని గిరిజనలు విజయవంతంగా సాగు చేస్తున్నారు. గులాబీ జాతికి చెందిన స్టాబెరిని మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో అధికంగా సాగు చేస్తున్నారు. లంబసింగి ప్రాంతంలో "వింటర్ డాన్"అనే రకాన్ని గిరి రైతులు సాగు చేస్తున్నారు. స్ట్రాబెరి మొక్క అడుగు భాగంలో ఫలాలు వస్తాయి. అవి నేలకు తగలకుండా మొక్క చుట్టూ ఎండుగడ్డి వేస్తారు.అందుకే దీన్ని స్ట్రాబెరీ అని పిలుస్తారు. విశిష్టత కలిగిన స్టాబెరి సాగుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ అల్లూరి సీతారామరాజు జిల్లా వాతావరణం అనుకూలంగా మారింది. 1995 లో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి లంబసింగి అటవీ ప్రాంతం స్ట్రాబెరీ సాగుకు అనుకూలమని నిర్ధారించారు.
మొదటిసారి సాగుతోనే మంచి ఫలితాలు రావడంతో ఈ ఫలం సాగుపై ప్రత్యేకంగా రైతులు దృష్టి సారించారు. మండలంలోని లంబసింగి గ్రామానికి 4 కి.మీ.దూరంలోనున్న గొందిపాకల గ్రామానికి చెందిన కుశలవుడు అనే గిరిజన రైతు ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారి స్ట్రాబెరీ సాగు చేశారు. 2008లో పూణే నుంచి స్ట్రాబెరీ మొక్కల్ని దిగుమతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో సాగు చేపట్టారు.అయితే మొదటిలో నీటి సదుపాయం లేకపోవడంతో పెట్టుబడి కూడా సరిగ్గా రాలేదు. అయినా అనుకూలమైన వాతావరణంలో స్ట్రాబెరి సాగు పై నమ్మకం పెట్టుకున్న ఆ రైతు సాగు కొనసాగించాడు. ఇప్పుడు లాభాల పంట పండిస్తున్నాడు. 2019 నవంబర్ లో 2 ఎకరాల్లో స్ట్రాబెరీ సాగు చేపట్టి మంచి లాభాలు ఆర్జించాడు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న స్టాబేరిని పర్యాటకులే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు నవంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. గిరి రైతులు పండించిన స్ట్రాబెరి 80శాతం స్థానికంగానే అమ్ముడుపోతుండగా మిగిలిన 20 శాతం మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం లంబసింగి ప్రాంతంలో స్ట్రాబెరి దిగుబడులు ప్రారంభమయ్యాయి.
ఈ ఏడాది లంబసింగి పరిసర ప్రాంతాల్లో సుమారు 50 ఎకరాల్లో స్టాబెరి సాగు చేపట్టారు. లంబసింగి జంక్షన్,లంబసింగి, రాజుపాకలు,చిట్రాలగొప్పు గ్రామాల వద్ద రహదారి కిరివైపులా స్టాల్స్ ఏర్పాటు చేసి వీటిని విక్రయిస్తున్నారు. 200 గ్రాములు చొప్పున స్టాబెరి పండ్లను ప్యాకింగ్ చేసి ఒక్కో ప్యాకెట్ ను రూ.100 లకు విక్రయిస్తున్నారు. ఈ స్ట్రాబెరి పండ్లను స్థానికంగా విక్రయించడమే కాకుండా స్పెన్సర్,మోర్,రిలయన్స్ వంటి పెద్ద పెద్ద విక్రయ కేంద్రాలకు నిత్యం సరఫరా చేస్తున్నారు. అల్లూరి మన్యంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం స్టాబెరికి అనుకూల వాతావరణం. ఎకరానికి 20 నుంచి 22 వేల మొక్కలు నాటుకోవచ్చు. దిగుబడి 8 నుంచి 10 టన్నుల వరకు పంట వస్తుంది. స్ట్రాబెరీ చాలా సున్నితంగా ఉంటుంది. నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల పై జాగ్రత్తలు పాటిస్తే మరింత నాణ్యమైన దిగుబడి వస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. స్టాబెరి సాగుకు ఆంధ్ర-కాశ్మీర్ అనుకూలమైన వాతావరణం.మార్కెటింగ్ కూడా పర్యాటకులే కస్టమర్లుగా వస్తున్నారు. మీరు ఎప్పుడైనా మా లంబసింగ్ ఏజెన్సీకి ఈ కాలంలో వస్తే తాజాగా లభించే ఈ మధుర ఫలాన్ని రుచి చూసి ఆరగించండి.ఈ మధుర జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోండి.
అమెరికా వింటర్ డాన్ రుచి ఆశ్వాదించండి..!