మన్యంలో మరో మణిహారం ‘కుంకుమపువ్వు’


Ens Balu
137
Chintapalli
2023-12-07 01:52:54

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలాగా చెప్పుకునే కుంకుమ పువ్వు విశాఖ మన్యంలో వికసించి ఏజెన్సీకి ఉజ్వల భవిష్యత్ ను ప్రసాదించాయి. అల్లూరి సీతారా మరాజు జిల్లా చింతపల్లిలో కుంకుమ పెంపకానికి చేసిన ప్రయోగాలు ఫలించి అవి వికసించాయి. చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఈ కుంకుమ పంటను పండించడంలో విజయం సాధించారు. ప్రస్తుతం ఈ అత్యంత ఖరీదైన పువ్వులు వికసించి, మన్యానికి మరింత వన్నె తెస్తున్నాయి. రెడ్ గోల్డ్(ఎర్ర బంగారం)గా పిలవబడే ఈ పువ్వు ధర కిలో.రూ. 2 లక్షలు. ఈ'రెడ్ గోల్డ్' కుంకుమపువ్వు ప్రస్తుతం మన దేశంలో జమ్మూ,కాశ్మీర్ లోని శ్రీనగర్ తో పాటు,కిష్త్వార్ జిల్లాల్లోని పాంపోర్ ప్రాంతంలోని హిమాలయ పర్వత శ్రేణులలో మాత్రమే పండిస్తున్నారు. ఇది ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన ఈ కుంకుమ పువ్వును ప్రధానంగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు. చింతపల్లితో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈ పంటకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కుంకుమ పువ్వులో ఉపయోగపడే ప్రధాన భాగం–ఎర్ర కేసరాలు. ఒక కిలో ఎర్ర కేసరాలు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు కావాలి. అందుకే కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యముగా పేరు గడించింది. ఈ ఎర్ర కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటాయి. కుంకుమ పువ్వు గర్భిణులు ఆహారంలో తీసుకుంటే పుట్టే బిడ్డ తెల్లగానో, ఎర్రగానో పుడతారని ప్రగాఢ నమ్మకం కూడా ఉంది..

 కుంకుమ పువ్వు డిమాండ్ 100 టన్నులు కాగా.. ఉత్పత్తి 4.46 టన్నులుమన దేశంలో కుంకుమపువ్వుకు విపరీతమైన డిమాండ్ ఉంది. భారత దేశంలో 100 టన్నులు డిమాండ్ ఉంటే ఉత్పత్తి మాత్రం 4.46 టన్నులు మాత్రమే.. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కుంకుమపువ్వు వార్షిక ఉత్పత్తి సంవత్సరానికి 300 టన్నులు మాత్రమే. మన దేశంలోనే దీని వినియోగం ఎక్కువ. ఈ ఖరీదైన కుంకుమపువ్వు సాగు ఉత్పత్తిలో ఇరాన్ ది మొదటి స్థానం కాగా..రెండో స్థానంలో స్పెయిన్..మన భారత దేశం మూడో స్థానంలో ఉంది.  షేడెడ్ నెట్లు, గ్లాస్ హౌస్ లో పెంపకం సముద్ర మట్టానికి 1,500 నుండి 2,800 మీటర్ల ఎత్తులో ఉన్న సమ శీతోష్ణ పొడి వాతావరణంలో కుంకుమపువ్వు బాగా వృద్ధి చెందుతుందని స్థానిక ప్రాంతీయ పరిశోధనా స్థానం అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ శాస్త్ర వేత్త ఎం సురేష్ కుమార్ వివరించారు.

 కుంకుమ పూలు పూయడానికి 17°C ఉష్ణోగ్రత అవసరం ఉంటుందన్నారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో షేడెడ్ నెట్లు,గ్లాస్ హౌస్ లు (కుండలు)బహిరంగ పొలాల్లో వీటిని పెంచుతారని వివరించారు. ఆగష్టు- అక్టోబర్ మధ్య మొత్తం 6,500 కుంకుమ విత్తనాలు నాటితే గ్లాస్ హౌస్ ల విషయం లో అధిక శాతం అంకురోత్పత్తి కనిపించిం దన్నారు. తరువాత షేడ్ నెట్, కొంత ఆలస్యంగా బహిరంగ పొలాల్లో పేలవ మైన అంకురోత్పత్తి కనిపించిందన్నారు. గ్లాస్ హౌస్ లోనే ఇది అతి వేగంగా ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఆగస్టులో షేడ్ నెట్ లో వేసిన విత్తనాలు మొలకెత్తాయని తెలిపారు. సెప్టెంబరులో నాటిన విత్తనాలు వికసించటానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. షేడ్ నెట్విషయానికొస్తే,మొదటి పువ్వు పూయ డానికి 87 రోజులు పట్టిందన్నారు.  సెప్టెంబరులో విత్తిన మొక్కకు మొదటి పువ్వు పూయడానికి 56 రోజులు పట్టడం విశేషమని ఆయన తెలిపారు.  ఒకప్పుడు ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకునే ఈ కుంకుమపువ్వును మన రాష్ట్రంలోనూ అందులోనూ ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి చేసివాటి ఫలసాయాలు తీయడం ద్వారా గిరిజనుల మరింత మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజనులను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలంటే ఈ తరహా పంటలను జిసిసి ద్వారా గిరిజనులతో పండించి..అదే జిసిసి ద్వారా మార్కెంటింగ్ చేస్తే ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం వుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం జిసిసి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంతో గిరిజనుల ద్వారా ఈ కుంకుమపువ్వుసాగుని పెద్ద మొత్తంలో చేపడితే అధిక ఆధాయం రావడంతోపాటు, గిరిజన రైతుల జీవితాల్లో కూడా వెలుగులు నిండే అవకాశం వుంది.