సర్వే నివేధికలు సమర్పించండి.. కాంతిలాల్ దండే


Ens Balu
2
Paderu
2020-09-14 18:58:02

విశాఖ ఏజెన్సీలోని భూమి లేని గిరిజన కుటుంబాలను గుర్తించడానికి చేపట్టిన సర్వే ప్రగతి నివేధకలు సమర్పించాలని గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే సూచించారు. ఈనెల 28 వతేదీలోగా కనీసం రెండు ఎకరాల భూమిలేని గిరిజన కుటుంబాలను గుర్తించి వచ్చేనెల 2వతేదీన పట్టాలు పంపిణీకి సిద్దం కావాలని స్పష్టం చేసారు. సోమవారం విజయవాడ గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు కార్యాలయం నుంచి ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారులతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి లేని కుటుంబాలు ఎన్ని, రెండు ఎకరాల కంటే తక్కువ ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సర్వే పూర్తి చేసి రెండు ఎకరాల భూమి పంపిణీ చేయడానికి భూములు గుర్తించి డి ఎల్ సి అనుమతులు పొందాలని స్పష్టం చేసారు. మన బడి నాడు నేడు పనుల ముఖ్యమంత్రి సలహాదారు మురళీ మాట్లాడుతూ నాడు నేడు పనులను ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. పాఠశాలల్లో నాడు నేడు లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. విద్యుత్తు, తాగునీరు,మరుగుదొడ్ల నిర్మాణాలు, ప్రహారీగోడలు నిర్మాణాలు వేగంగాపూర్తి చేయాలన్నారు. భవనాలు లేని పాఠశాలలకు ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తామన్నారు. పాఠశాలల నిర్మాణపు పనులు పూర్తియిన వెంటనే రంగువేయడానికి సిద్దం చేసామన్నారు. విద్యుత్తు లేని పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని చెప్పారు. ఐటి డి ఏ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల మాట్లాడుతూ 1 లక్ష 7 వేల కుటుంబాలను సర్వే చేసామని చెప్పారు. 14 వేల రెండు వందల కుటుంబాలకు కనీసం భూమి లేదన్నారు. ఈనెల 24 వతేదీన జిల్లా స్దాయి కమిటీ సమావేశం నిర్వహించి అనుమతులు తీసుకుంటామన్నారు. పాడేరు డివిజన్ పరిధిలో 367 పాఠశాలల్లో నాడు నేడు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వాటిలో 85 పాఠశాలలను తనిఖీ చేసామన్నారు. గ్రామ సచివాలయాలకు నెట్ వర్క్ సౌకర్యంలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,పాడేరుకు 19 మొబైల్ టవర్లు మంజూరు చేసారని ఇంకా మరికొన్ని టవర్లు మంజూరు చేయాలని కోరారు.