పౌష్టికాహార లోపంతో రక్తహీనత భారినపడతాం..
Ens Balu
6
Kakinada
2021-11-26 15:40:27
సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వలన యుక్తవయసు మహిళలు, గర్భిణీలు, బాలింతలు రక్తహీనతకు గురవుతున్నారని ప్రాణిక్ హీలింగ్ నిపుణులు ఎం.వరలక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేట కొత్తూరు అంగన్వాడి కేంద్రం లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ రక్త హీనత నివారణ దినోత్సవం పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమం ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రక్తహీనత మహిళల్లో ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఋతుస్రావం సమయంలో రక్తం నష్టం ఎక్కువగా ఉంటుందని అదేవిధంగా పురుడు సమయంలో అధిక రక్త స్రావం వలన రక్తహీనత ఏర్పడుతుందన్నారు. కళ్ళు తిరగడం, ఆయాసం, శ్వాసలో ఇబ్బందులు, బడలిక, ఒళ్ళు నొప్పులు, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తే రక్తహీనత సమస్యగా గుర్తించాలన్నారు. దీని నివారణ కోసం మెంతుకూర, తోటకూర ,గోంగూర, బెల్లం ఉండలు, కొర్రలు, రాగులు, యాపిల్, బత్తాయి, దానిమ్మ అధికంగా తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారంతో పాటు ఐరన్ టాబ్లెట్లను వైద్యుల సూచనల పై వినియోగించాలని ఎం. వరలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, సత్యనారాయణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.