ప్రస్తుత యాంత్రిక జీవనంలో మంచి ఆహారపు అలవాట్లు వలన మాత్రమే ఆరోగ్యంగా జీవించవచ్చునని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రాంజీ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాంజీ మాట్లాడారు. చెడు అలవాట్ల వలన నిద్రలేమి వస్తుందని దీంతో అనేక శారీరక, మానసిక వ్యాధులు వేధించే అవకాశం ఉందన్నారు. రాత్రి పొద్దు పోయే వరకు మెలకువగా లేకుండా తొందరగా ఆహారం తీసుకొని నిద్రకు ఉపక్రమించాలని సూచించారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉందన్నారు. పరిమితంగా తీసుకోవాలని, రోజూ శారీరక వ్యాయామం చేయాలని ,నిత్యం ఏసీ గదుల్లో కాకుండా సూర్యరశ్మిలో కూడా తిరగాలని డాక్టర్ రాంజీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, పట్నాయక్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.