అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడి కత్తిదారులపై బైండోవర్ కేసులు నమోదు చేసి 25 కోడి కత్తులను సీజ్ చేసినట్టు ఎస్ఐ రవికుమార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం అన్నవరంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పి రవీంద్రనాథ్ బాబు ఉత్తర్వులు మేరకు రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, గుండాటలు మరియు పేకాటలు వంటి జూద క్రీడలు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. కోడిపందాలుకు ఉపయోగించే కోడి కత్తులు తయారు చేసే వారిని, కోడిపందాలు కేసుల్లో పాత ముద్దాయిల్ని 23 మందిని శంఖవరం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు చెప్పారు. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలల్లో ఏవిధమైన జూద క్రీడలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.