ప్రభుత్వం అందించే సంపూర్ణ పశు దాణా(టోటల్ మిక్సర్ రేషన్)ను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని వేలంగి సర్పంచి మేకల సత్యన్నారాయణ అన్నారు. మంగళవారం వేలంగి రైతు భరోసా కేంద్రంలో ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన సంపూర్ణ దాణాను గ్రామీణ పశుసంవర్ధక సహాయకులు నాగేంద్రతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సంపూర్ణ పశు దాణా(టోటల్ మిక్సిడ్ రేషన్)ను ఒక కేజి రూ.6.50కే అందిస్తుందన్నారు. ఈ దాణాను పశువులకు పెట్టడం ద్వారా పశులు సకాలంలో ఎదకు రావడం, పాలు అధికంగా ఇవ్వడం, పుష్టిగా తయారవుతాయని తెలియజేశారు. పాడి రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు రైతు భరోసా కేంద్రాల్లోనే అందిస్తుందన్నారు. టీకాల దగ్గర నుంచి దాణాల వరకూ అన్ని సేవలు ఇక్కడే పొందవచ్చునని తెలియజేశారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పాడి రైతులు పాల్గొన్నారు.